చంద్ర బాబు పంచాయతీ ఎన్నికలను ఎలా తప్పించు కోవాలో ఆలోచిస్తున్నాడు. దీనితో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. చివరిసారిగా పంచాయతీ ఎన్నికలు జరిగినది కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో. లెక్క ప్రకారం ఐదేళ్లు గడిచిపోయాయి. పంచాయతీ ప్రెసిడెంట్ల పదవీకాలం ముగిసిపోయింది. మాజీ ప్రెసిడెంట్లే మిగిలారు. చట్టప్రకారం చూస్తే.. ప్రెసిడెంట్‌ల పదవీకాలం ముగిసే సరికే మళ్లీ కొత్త ప్రెసిడెంట్ల ఎన్నిక జరగాలి. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాన్నాళ్ల కిందటే ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టాల్సింది.


అయితే చంద్రబాబు మాత్రం ఆ పని చేయలేదు. ఏవేవో సాకులు చెప్పి ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇలా సాకులు చెప్పి ఎన్నికలను వాయిదా వేయడం అంటే.. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే పని చేసింది. వైఎస్ మొదటి టర్మ్ లో ఎన్నికైన పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ల పదవీకాలం ముగిశాకా.. ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు కిరణ్ రెడ్డి సాహసం చేయలేదు.అయితే చివరకు కోర్టు ఒత్తిడితో కిరణ్ కు ఆ ఎన్నికలు తప్పలేదు. చివరకు ఎలాగోలా నిర్వహించారు.


పంచాయతీ ఎన్నికలు ఎలాగూ పార్టీల గుర్తుల మీద జరగవు కాబట్టి.. మెజారిటీ సీట్లను తామే గెలిచామని కాంగ్రెస్ వాళ్లు ప్రచారం చేసుకున్నారు.కిందపడ్డా పైచేయి తనదే అని కిరణ్, కాంగ్రెస్ లు అనిపించుకున్నాయి. ఆ తర్వాత అసలు ఎన్నికల్లోపత్తాలేకుండాపోయారనుకోండి. మరి ఇలాంటి అవకాశం ఉన్నా కొన్ని నెలలుగా చంద్రబాబు నాయుడు పంచాయతీ ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్నాడు. అదేమంటే సాకులు చెబుతున్నారు.

కేవలం బాబు వాయిదా వేస్తున్నవి పంచాయతీ ఎన్నికలే కాదు సుమా.. జీవీఎంసీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవికాలం కూడా దాదాపు ముగుస్తున్నట్టే. అలాగే మున్సిపోల్స్ కూడా త్వరలోనే నిర్వహించాలి. వాటిలో వేటికీ బాబు సర్కారు సమాయత్తం కాకపోవడం.. వాటిని కూడా ఏదో ఒక రీజన్ చెప్పి వాయిదాలకే మొగ్గు చూపుతుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: