వైద్యుల పర్యవేక్షణలో 24 గంటలు గడిపిన తర్వాత వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. గురువారం మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో విశాఖపట్నంలోని విమానాశ్రయం లాంజ్ లో జగన్ హత్యాయత్నానికి గురైన విషయం తెలిసిందే. విమానాశ్రయంలోనే ఉన్న క్యాంటిన్ లో పనిచేసే వర్కర్ శ్రీనివాస్ సెల్ఫీ తీసుకుంటానని చెప్పి దగ్గరకు వచ్చి జగన్ పై కత్తితో దాడి చేసిన విషయం అందరూ చూసిందే. విమానాశ్రయంలోనే ప్రధమ చికిత్స చేయించుకున్న జగన్ పూర్తిస్ధాయి చికిత్స కోసం హైదరాబాద్ వచ్చేశారు.

 

రాజధానిలోని సిటీన్యూరో ఆసుపత్రిలో చేరిన జగన్ కు వైద్యులు 9 కుట్లు వేశారు. ఒకటిన్నర సెంటీమీటర్ల వ్యసార్ధంతో మూడు సెంటీమీటర్ల లోతులో గాయమైంది. దాంతో కుట్లు వేసే సమయంలో డాక్టర్లు సెడేషన్ ఇవ్వటంతో గురువారం సాయంత్రం నుండి  జగన్ మగతలోనే ఉన్నారు.  శుక్రవారం ఉదయం మరోసారి పరీక్షించిన వైద్యులు జగన్ ను మధ్యాహ్నం డిశ్చార్జి చేశారు. గాయం లోతుగా అయ్యింది కాబట్టి కొద్ది రోజులు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. మొత్తానికి వేలాదిమంది అభిమానుల మధ్యే జగన్ లోటస్ పాండ్ లోని తన ఇంటికి చేరుకున్నారు.

 

పాదయాత్ర చివరి దశలొ ఉండగా హత్యాయత్నం జరగటంతో మళ్ళీ పాదయాత్ర ఎప్పుడు ప్రారంభించేది తెలీదు. జగన్ మనస్తత్వం ప్రకారమైతే మరో నాలుగు రోజుల్లోనే ప్రారంభయే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే, వానొచ్చినా, ఎంత ఎండలు కాస్తున్న, చివరకు ఇన్ఫెక్షన్ సోకినా, తీవ్రమైన జ్వరంలో ఉండి కూడా జగన్ పాదయాత్రను మాత్రం ఆపలేదు. ఏదో బంద్ సందర్భంగానో లేకపోతే పండుగలప్పుడో అదీకాకపోతే కుండపోత వర్షం పడుతున్నపుడు మాత్రమే అదికూడా తనతో నడిచే జనాలు ఇబ్బందులు పడకూడదనే పాదయాత్రకు విరామం ఇచ్చారు. సరే, కోర్టులో హాజరవ్వటానికి ప్రతీ శుక్రవారం పాదయాత్రకు విరామం ఇస్తున్న విషయం తెలిసిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: