ఏపీ రాజకీయాల సీన్ మారుతోంది. ఇంతకాలం ఏపీలో సాగిన సమరం ఇపుడు తెలంగాణా మీదుగా డిల్లీ వైపు మళ్ళింది. డిల్లీ యాత్రలకు రెండు పార్టీలు రెడీ అవుతున్నాయి. వైఎస్ జగన్ పై జరిగిన హత్యా కాండను డిల్లీలో రాజ్యాంగ రక్షకులకు, కేంద్ర పాలకులకు వివరించడానికి వైసీపీ సమాయత్తమవుతోంది. మరో వైపు చంద్రబాబు సైతం డిల్లీకి బయల్దేరివెళ్తున్నారు. ఆయన వెంట కూడా మందీ మార్బలం దండిగానే ఉంది.


ఇప్పటికే గవర్నర్ :


డిల్లీలో ఇప్పటికే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసిమ్హన్ విడిది చేశారు. ఆయన ఏపీలో తాజాగా జరిగిన పరిణామాలపై కేంద్ర పెద్దలకు నివేదికలు ఇస్తున్నారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష  నాయకుడి పై జరిగిన హత్యా యత్నం ఘటనను ఆయన నివేదికల రూపంలో వివరిస్తున్నారు.  ఏపీకి సంబంధించి రాజకీయ వాతావరణం ఎలా ఉందన్నది గవర్నర్ నివేదికల ద్వారా కేంద్రానికి  చాలా క్లారిటీగానే తెలుస్తోంది. 


బాబుపై ఫిర్యాదు :


ఇంకోవైపు చంద్రబాబుపై ఫిర్యాదు చేసేందుకు, తగిన న్యాయం కోసం వైసీపీ నాయకులు డిల్లీకి వెళ్తున్నారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికే రక్షణ లేకపోతే సామన్యుడి సంగేతేంటన్నది వైసీపీ లేవనెత్తబోయే ప్రశ్నగా ఉంటోంది. ప్రధాని మోడీతో పాటు, కేంద్ర హోం మంత్రి, రాష్ట్రపతిని వైసీపీ బ్రుందం కలవబోతోంది. ఈ బ్రుందంలో వైసీపీ సీనియర్ నాయకులంతా ఉంటున్నారు. రేపు (శనివారం) డిల్లీ బయల్దేరి ఈ బ్రుందం అక్కడ కేంద్ర పెద్దలతో భేటీ కాబోతోంది. జగన్ పై జరిగిన దాడిపై సీబీఐ విచారణను కూడా వేయాలని డిమాండ్ చేయబోతోంది.


బాబు టూర్ ఖరార్ :


ఇక ఏపీ సీఎం చంద్రబాబు కూడా రేపు (శనివారం) డిల్లీకి వెళ్తున్నారు. ఆయన డిల్లీలో విపక్ష  నాయకులతో భేటీ అవుతారని తెలుస్తోంది. ఏపీలో జరుగుతున్న పరిణామాలు, తన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కేంద్రంలోని మోడీ, ఏపీలోని విపక్షాలు  కలసి చేస్తున్న ఉమ్మడి దాడిని బాబు జాతీయ విపక్ష నేతలకు వివరించనున్నారని సమాచారం. విపక్షాలను ఏకత్రాటిపైకి తీసుకురావడం ద్వారా మోడీని ఎదుర్కోవాలన్నది బాబు ఆలోచనగా కనిపిస్తోంది. మొత్తానికి రేపటి రోజున డిల్లీ రాజకీయం ఎలా ఉండబొతోందో అక్కడి నుంచే చూడొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: