జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో ఇద్దరు వైసిపి నేతలకు సిట్ నోటీసులు జారీ చేసింది. నవంబర్ 2వ తేదీన విశాఖపట్నంలో జరిగే విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో సిట్ స్పష్టంగా చెప్పింది. అయితే, నోటీసులు అందుకున్న ఇద్దరు నేతలు విచారణకు హాజరుకావటానికి ఇష్టపడటం లేదు. విశాఖపట్నం విమానాశ్రయం లాంజ్ లో జగన్ కూర్చున్నపుడు సెల్ఫీ కావాలంటూ శ్రీనివాస్ అనే యువకుడు అడిగారు. జగన్ అందుకు ఒప్పుకోవటంతో దగ్గరకు రాగానే కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన విషయం అందిరకీ తెలిసిందే.


హత్యాయత్నం నుండి జగన్ తృటిలో తప్పించుకున్నారు. అయితే ఎడమభుజానికి మాత్రం లోతైన గాయమైంది. యువకుడు జగన్ పై దాడి సమయంలో పక్కనే విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం ఎంఎల్ఏ పీడిక రాజన్నదొర, సీనియర్ నేత మజ్జి శ్రీనివాసరావుకు సిట్ నోటీసులు పంపింది. 2వ తేదీన సిట్ కార్యాలయానికి రావాలని నోటీసులో ఉంది. అయితే, వారిద్దరూ విచారణకు హాజరయ్యే ఉద్దేశ్యంలో లేరని సమాచారం. రాష్ట్రప్రభుత్వం చేస్తున్న విచారణలో తమకు నమ్మకం లేదని జగన్ తో పాటు సీనియర్ నేతలందరూ ఒకేమాట చెబుతున్న విషయం తెలిసిందే.

 

అందుకే కేంద్ర దర్యాప్తు సంస్ధతో కానీ లేకపోతే జ్యుడిషియల్ విచారణ కానీ చేయించాలని డిమాండ్  చేస్తున్న విషయం తెలిసిందే. అందుకనే 2వ తేదీన విచారణకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. తమకు నోటీసులు అందిన విషయాన్ని తమ పార్టీ అగ్రనేతలకు తెలియజేయాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. విచారణ విషయంలో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిదే అంతిమ నిర్ణయమని, నేరుగా కోర్టులో జరిగే విచారణలోనే న్యాయమూర్తి ముందు హాజరై తమ వాదనలు, సాక్ష్యాలను అందించే అవకాశాలను కూడా వైసిపి నేతలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, న్యాయమూర్తి ముందు హాజరవ్వటమంటే అందుకు చాలా కాలం పట్టే అవకాశాలున్నాయి. కాబట్టి ఈలోగా వైసిపి ఏమి చేస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: