బిజెపియేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే కార్యక్రమంలో చంద్రబాబునాయుడు తొలి షాక్ తగిలింది. ఢిల్లీకి వెళ్ళగానే చంద్రబాబు కేంద్రమాజీ మంత్రి శరద్ పవార్, కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాలను కలిశారు. తర్వాత ఏఐసిసి అధ్యక్షుడు రాహూల్ గాంధీతో కూడా భేటీ అయ్యారు. తర్వాత చంద్రబాబు, శరద్ పవార్, ఫారూఖ్ ముగ్గురు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు.


మీడియాతో ముందు ఫరూఖ్ మాట్లాడుతూ, సిబిఐ, ఆర్బిఐ వ్యవస్ధల మనుగడ ప్రమాదంలో పడినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని, వ్యవస్దలను, సంస్దలను ఎలా రక్షించుకోవాలనే విషయమై తాము చర్చించుకున్నట్లు చెప్పారు. బిజెపియేతర పార్టీల కూటమికి తాము ముగ్గురం కన్వీనర్లుగా ఉండనున్నట్లు చెప్పారు. చెప్పిన వెంటనే మీడియా సమావేశంలో నుండి లేచి వెళ్ళిపోయారు. తనకు ఫ్లైట్ కు సమయం అయిపోయిందని ఫరూఖ్ చెప్పటం విచిత్రంగా ఉంది,

 

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని కాబట్టి బిజెపియేతర పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తనతో చెప్పారని పవార్ చెప్పారు.  ఆ విషయమై వచ్చి కలిసి మాట్లాడుతానంటే తాను సరేఅన్నట్లుగా తెలిపారు. అంటే చంద్రబాబు వచ్చి కలుస్తామని అంటేనే తాము కలిసినట్లు శరద్ పవార్ స్పష్టంగా చెప్పారు. నిజానికి బిజెపికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ప్రస్తుతానికి చంద్రబాబుకు మాత్రమే ఉందనేది వాస్తవం. బిజెపికి వ్యతిరేకంగా, నరేంద్రమోడికి వ్యతిరేకంగా చాలా పార్టీల అధినేతలు మండుతున్నప్పటికీ ఇప్పటికిప్పుడు వారంతా ఏకమవ్వాల్సిన అవసరం ఎవరికీ లేదు.

 

పశ్చిమ బెంగాల్లో మమత బెనర్జీ కూడా బిజెపికి వ్యతరేకమే. కానీ మమతను కాదని బిజెపి, మోది చేయగలిగేదేమీ లేదు. పైగా ఇప్పటికిప్పుడు అక్కడ ఎన్నికలూ లేవు. ఇక శరద్ పవార్ మహరాష్ట్రలో అధికారంలోకి వచ్చేదేమీ లేదు. ఫరూఖ్ పరిస్దితి కూడా దాదాపు అదే. ఉత్తరప్రదేశ్ లో మాయావతి, ములాయంసింగ్ యాదవ్ పరిస్ధితి కూడా డిటోనే. ఎటు చూసినా తక్షణ అవసరం ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉంది.


అందులోను ఏపిలో వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలిచే పరిస్ధితి లేదనే ప్రచారం ఎక్కువైపోతోంది. నాలుగున్నరేళ్ళ పాలనలో అన్నీ వర్గాలు వ్యతిరేకమైపోయాయి. దానికితోడు పీకల్లోతు అవినీతి ఆరోపణలు వినబడుతున్నాయి. కాబట్టి చంద్రబాబులోనే భవిష్యత్ పై టెన్షన్ మొదలైంది. అందుకనే బిజెపి వ్యతిరేకపార్టీలని ఏకం చేయాలంటూ హడావుడి మొదలుపెట్టారు. అంతకుముందు రాహూల్ తో కూడా చంద్రబాబు సుమారు 40 నిముషాలపాటు భేటీ అయ్యారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: