ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీల సమీకణలు మారిపోతున్నాయి. ఇపుడిదే అంశంపై అంతటా చర్చ మొదలైంది. బద్ధ శతృవులైన కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీల పొత్తులు పెట్టుకోవటమే అందుకు నిదర్శనం. అంశలవారీగా వైసిపి నేతలకు బిజెపి నేతలు మద్దతు పలకటం మరో ఉదాహరణ. ఇక తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి నైతిక మద్దతుగా మాట్లాడటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబునాయుడు అవినీతి పాలనపై ఆరోపణలు చేయటంలోను, ఆందోళనలు చేయటంలోను వైసిపి, బిజెపి నేతలు ఒకే బాటలో నడుస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. కాబట్టే మోడితో జగన్ జత కట్టాడంటూ చంద్రబాబు తరచూ ఆరోపిస్తున్నది.

 

ఇదంతా ఒక ఎత్తైతే వారం రోజుల క్రితం విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై హత్యాయత్నం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. హత్యాయత్నం జరగటం ఒక ఎత్తైతే, దాన్ని ఎగతాళి చేస్తు చంద్రబాబు మాట్లాడటం మరోఎత్తు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు వీళ్ళని లేకుండా జగన్ కు సానుభూతి చూపిస్తూనే చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు. దాంతో చంద్రబాబుకు పెద్ద షాక్ కొట్టినట్లైంది. జగన్ పై హత్యాయత్నం జరిగి వారం దాటిన తర్వాత శుక్రవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక్కసారిగా చంద్రబాబుపై చెండాతున్నారు. జగన్ కు ఈ స్ధాయిలో పవన్ నుండి నైతిక మద్దతు లభించటంతో వైసిపి నేతలే ఆశ్చర్యపోతున్నారు.

 

జగన్ విషయంలో పవన్ నైతిక మద్దతు చూసిన వారంతా రెండు పార్టీల మధ్య పొత్తుల అవకాశంపై చర్చ మొదలుపెట్టారు.  నిజానికి జగన్, పవన్ పొత్తులు పెట్టుకునే విషయం ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది. కాకపోతే ఆ ప్రచారం ప్రచారంగానే మిగిలిపోతోంది. కానీ ఇఫ్పటి ప్రచారం మాత్రం గట్టిగానే జరుగుతోంది.  పోయిన ఎన్నికల్లో కాపుల్లో మెజారిటీ ఓట్లు చంద్రబాబుకు అనుకూలంగా పడటంలో పవన్ పాత్ర ఎక్కువనే చెప్పుకోవాలి. అలాంటిది కాపుల ఓట్లు పోయినసారిలాగ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి పడేది అనుమానమే.

 

అదే సమయంలో నాలుగున్నరేళ్ళ పాలనలో చంద్రబాబుపై అన్నీ వర్గాల్లోను వ్యతిరేకత పెరిగిపోతోందన్నది వాస్తవం. ఈ పరిస్ధితుల్లో జగన్, పవన్ కలిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా నివారించవచ్చు కదా అనే చర్చ ఊపందుకుంది. ఇప్పటికైతే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది జగనే అనే ప్రచారం బాగా జరుగుతోంది. పవన్ విషయాన్ని ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవటం లేదు. రేపటి ఎన్నికల్లో పవన్ ఓ 20 సీట్లు దక్కించుకుంటే కాస్త పరువైనా నిలుస్తుంది. కానీ అన్ని సీట్లు దక్కేది అనుమానమనే అంటున్నారు. కాకపోతే కాపుల ఓట్లపై పవన్ ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువని ప్రచారం జరుగుతోంది.

 

ఈ నేపధ్యంలోనే జగన్ , పవన్ కలిసి పోటీ చేస్తే బాగుంటుందని కదా అనే ప్రతిపాదన మొదలైందట. వైసిపి తరపున బొత్సా సత్యనారాయణ, పవన్ తరపున చిరంజీవి మధ్య టాక్స్ మొదలైనట్లు ప్రచారం ఊపందుకుంది. అది నిజమే అయితే చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రావటం దాదాపు కష్టమే. కాకపోతే ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలనే విషయమే తేలాలి. పొత్తులు పెట్టుకోవాలని అనుకున్న తర్వాత సీట్ల షేరింగ్ పెద్ద విషయం కాదనుకోండి. కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీలే పొత్తు పెట్టుకున్న తర్వాత జగన్, పవన్ కలవటం పెద్ద కష్టమా చెప్పండి ?


మరింత సమాచారం తెలుసుకోండి: