చూడబోతే పరిస్ధితులు అలాగే కనబడుతోంది.  ఒకవైపు షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. పనిలో పనిగా చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల్లోనే కాకుండా పార్టీ నేతల్లోనే వ్యతిరేకత వచ్చేస్తోంది.  ఇక చంద్రబాబు పాలనపై జాతీయ మీడియాలో వస్తున్న సర్వే నివేదికలు బోనస్. దాంతో వచ్చే ఎన్నికల్లో ఎలా గట్టెక్కాలో అర్ధంకాక చంద్రబాబుకే టెన్షన్ పెరిగిపోతోందంటే ఇక మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిల మాట చెప్పేదేముంది ?

 

నిజానికి చంద్రబాబు బ్యాడ్ టైం ఓటుకునోటు కేసు బయటపడటంతోనే మొదలైంది. గెలవటానికి ఏమాత్రం అవకాశం లేని ఎన్నికల్లో వేలుపెట్టి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను అర్ధాంతరంగా వదిలిపెట్టి విజయవాడకు పారిపోవాల్సొచ్చింది. అక్కడి నుండి మళ్ళీ చంద్రబాబు తలెత్తుకు తిరగలేకున్నారు.  దానికితోడు వచ్చే ఫిబ్రవరి నుండి ఓటుకునోటు కేసును రెగ్యులర్ గా విచారిస్తామని సుప్రింకోర్టు చెప్పటం కూడా చంద్రబాబును బాగా ఇబ్బంది పెట్టేదనటంలో సందేహం అక్కర్లేదు. ఏదో లేస్తే మనిషిని కాదంటూ మీడియా మద్దతుతో నెట్టుకొచ్చేస్తున్నారు. రాజధాని నిర్మాణమన్నారు.  చంద్రబాబుకు తప్ప ఎక్కడుందో ఎవరికీ కనబడదు. మొత్తానికి అమరావతిని భ్రమరావతిగా మార్చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు.

 

నాలుగున్నరేళ్ళ పాలనలో అన్నీ వ్యవస్ధలను ధ్వంసం చేసేశారు. ఎక్కడబడితే అక్కడ అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. పోయిన ఎన్నికల్లో మద్దతుగా నిలబడిన బిజెపి, పవన్ కల్యాణ్ వేరు కుంపటి పెట్టుకున్నారు. ఇప్పుడైతే చంద్రబాబుకు బద్ద శతృవులైపోయారు. చంద్రబాబు ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన దగ్గర నుండి కేంద్రం సహాయనిరాకరణ బాగా ఎక్కువైపోయింది. నిజానికి అది చంద్రబాబు చేతకాని తనంగానే చెప్పుకోవాలి.

 

ఇవన్నీ ఒక ఎత్తైతే జగన్ పాదయాత్ర మరోఎత్తు. జగన్ పాదయాత్రకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారంటే అది చంద్రబాబు మీద వ్యతిరేకతతోనే అని అందరికీ అర్ధమైపోతోంది. ఆ విషయం అర్ధమవ్వటంతోనే చంద్రబాబులో కూడా ఆందోళన పెరిగిపోతోంది. అటువంటి సమయంలోనే టిడిపిలోని కీలక నేతలపై ఐటి, ఈడి దాడులు మొదలయ్యాయి.  ఒకవైపు ఈ టెన్షన్ పెరిగిపోతుండగానే హఠాత్తుగా విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై హత్యాయత్నం జరిగింది. హత్యాయత్నం తర్వాత చంద్రబాబు వ్యవహరించిన తీరుతో సర్వత్రా వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. ఆ వ్యతిరేకత పెరిగిపోతున్న సమయంలోనే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు.

 

నిజానికి కాంగ్రెస్ తో పొత్తు తెలంగాణా ముందస్తు ఎన్నికల్లోనే పెట్టుకున్నారు. అది తెలంగాణా వరకే అనుకున్నారు. ఎలాగూ తెలంగాణాలో టిడిపి ఉనికే కోల్పోయింది కాబట్టి ఎవరితో పొత్తుపెట్టుకున్నా నష్టమేమీ లేదని అందరూ అనుకున్నారు. కానీ ఆ పొత్తు ఏపికి కూడా వచ్చేటప్పటికి నేతలు, మామూలు జనాలు తట్టుకోలేకపోతున్నారు. ఇవన్నీ కలిసి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కొంపముంచుతాయేమోనని టిడిపి నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే చంద్రబాబుకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందేమోనని పార్టీ నేతలే ఆఫ్ ది రికార్డుగా చర్చించుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: