కాంగ్రెస్, టిడిపిల మధ్య పొత్తుల విషయంలో చంద్రబాబునాయుడుకు షాక్ తగలటానికే అవకాశాలు ఎక్కువున్నాయి. రెండు పార్టీల పొత్తులను నిరసిస్తూ కాంగ్రెస్ లో మొదలైన రాజీనామాలు మరింత ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. టిడిపి నేతల్లో కూడా చాలామందికి కాంగ్రెస్ తో పొత్తు ఇష్టం లేదని మంత్రులు కెఇ కృష్ణమూర్తి, చింతకాయల అయ్యన్నపాత్రుడు డైలాగులతో అర్ధమైపోయింది. కాకపోతే మిగిలిన నేతలే ఇంకా బయటపడలేదు.

 

నిజానికి  రెండు పార్టీల మధ్య పొత్తుల విషయం హఠాత్తుగా మొలిచిందేమీ కాదు. కర్నాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఏఐసిసి అధ్యక్షుడు రాహూల్ గాంధి, చంద్రబాబు కలిసినపుడే అందరిలోను అనామానాలు మొదలయ్యాయి. తర్వాత తెలంగాణా ముందస్తు ఎన్నికల నేపధ్యంలో అందరి అనుమానాలు నిజమయ్యాయి. అయితే, తెలంగాణా ఎన్నికల సందర్భంలో చంద్రబాబు ఎప్పుడు తెరముందుకు రాకుండా జాగ్రత్త పడ్డారు. పొత్తుల చర్చ విషయంలో కానీ సీట్ల సర్దుబాటు విషయంలో కూడా చంద్రబాబు ఎక్కడా బహిరంగంగా యాక్టివ్ గా కనబడలేదు.

 

సరే, తెలంగాణాలో ఒకటో రెండో సీట్లు అటో ఇటుగా పొత్తులు కుదిరిపోయాయి. పొత్తుల్లో పోటీ చేసేటపుడు భాగస్వామ్యపార్టీల మధ్య ఏవో చిన్న చిన్న గొడవలు మామూలే అనుకోండి అది వేరే సంగతి.  మూడు రోజుల క్రితం ఢిల్లీలో రాహూల్ గాంధితో చంద్రబాబు బేటీ అయ్యారో  దాంతో ఏపిలో కూడా పొత్తులు ఖాయమని తేలిపోయింది. పొత్తుల్లో భాగంగా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి 25 అసెంబ్లీ టిక్కెట్లు, 5 పార్లమెంటు స్ధానాలు ఇవ్వటానికి అంగీకరించారని ప్రచారం ఊపందుకుంది. ఇక్కడే అందరిలోను ఓ అనుమానం మొదలైంది. రెండు పార్టీల మధ్య పొత్తుల్లో లాభమెవరకి ? నష్టమెవరికి ? అన్నదే ఆ అనుమానం.

 

పొత్తులతో నిజానికి కాంగ్రెస్ పార్టీకి నష్టమనేది కొత్తగా జరిగేదేమీ ఉండదు. జరాగాల్సిన నష్టమేదో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పోయిన ఎన్నికల్లోనే అయిపోయింది. పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని జనాలు గొయ్యితవ్వ కప్పేశారు. కాబట్టి టిడిపితో పొత్తు పెట్టుకోవటం వల్ల కాంగ్రెస్ పార్టీకి జరిగే నష్టమేదీ లేదని అర్ధమైపోతోంది. ఏమైనా జరిగితే లాభమే అనుకోవాలి. అదే సమయంలో టిడిపి మాటేమిటి అనే ప్రశ్న వినిపిస్తోంది. నాలుగున్నరేళ్ళ చంద్రబాబు పాలనలో దాదాపు అన్నీ వర్గాలు టిడిపికి వ్యతిరేకమైపోయాయి.

 

పోయిన ఎన్నికల్లో అధికారంలోకి రావటమే లక్ష్యంతో అడ్డదిడ్డమైన హామీలిచ్చేశారు. వాటి అముల్లోకి వచ్చేసరికి చతికిలపడ్డారు. దాంతో ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు కాకపోవటంతో జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. దానికితోడు పోయిన ఎన్నికల్లో చంద్రబాబును భుజాన మోసిన బిజెపి, జనసేనలు వేరు కుంపట్లు పెట్టుకున్నాయి. దాంతో టిడిపి వచ్చే ఎన్నికల్లో  అధికారంలోకి వచ్చేది అనమానంగానే ఉంది. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, టిడిపిలు పొత్తులు పెట్టుకున్నాయి.

 

మొత్తంమీద చూస్తే టిడిపి వల్ల కాంగ్రెస్ కు నాలుగు ఓట్లు పడతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు పార్టీల మధ్య ఓట్ల షేరింగ్ అనుమానమే అంటున్నారు. ఎందుకంటే, రెండు పార్టీలు కలవటం ఇరుపార్టీల్లోని నేతలకు ఇష్టం లేదని తేలిపోయింది. రాజీనామాలతో కాంగ్రెస్ నేతలు బయటపడుతున్నా టిడిపి నేతలు ఇంకా గుంభనంగానే ఉన్నారు. కాబట్టి పొత్తుల వల్ల టిడిపికే నష్టం ఎక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.   


మరింత సమాచారం తెలుసుకోండి: