దీపావళి అంటే టపాసుల మోత, మతాబుల వెలుగులు, చిచ్చుబుడ్డి రెచ్చిపోవడాలు, కాకర పువొత్తుల మెరుపులు... ఇలా అన్నింటా కాంతుల సందళ్ళే. ప్రతి లోగిలిలో ఆనందపు పరవళ్ళే. మరి అటువంటి దీపావళిని మన రాజకీయనాయకులు ప్రతీ రోజూ రాజకీయ తెరపై చూపించేస్తూంటారు. బాంబుల మోత మోగించేస్తూంటారు.


హామీల జువ్వలు :


ప్రతీ రోజు మన నాయకులు చేసే ప్రకటనలు సీమ  టపాసులే, తాజా జువ్వల్లాంటి హామీలు ఇచ్చి ఆకాశం వైపు కూడా  చూపిస్తూంటారు. మతాబుల కాంతులను వెదజల్లేలా చిన్న చిన్న పధకాలు పెట్టి పండుగ చేసుకోమంటారు. మధ్యలో బాంబుల్లాంటి  వార్తలతో పన్నులు వేస్తూంటారు. ధరలు పెంచి గుండె దడ పెంచేస్తారు.


.
లక్ష్మీ బాంబు పేల్చిన బాబు :


దీపావళికి ముందే మన చంద్రబాబునాయుడు గారు లక్ష్మీబాంబు పేల్చేశారు. ఆ శబ్దానికి తమ్ముళ్ళు చెవులు మూసుకున్నా బీపీ మాత్రం పెరిగిపోతోంది. ఏ పార్టీకి వ్యతిరేకంగా అన్న నందమూరి టీడీపీని ఏర్పాటు చేశారో ఆ కాంగ్రెస్ ని కౌగలించేసుకుని సైకిల్ పార్టీకి బాంబు లాంటి న్యూస్ అందించారు. ఆరు నెలల క్రితం వరకూ తిట్టిన కాంగ్రెస్ ఇపుడు మతాబులా బ్రహ్మాండంగా బాబు గారికి కనిపించింది. మోదీ, బాబు జోడీ అన్నది ఇపుడు ఆరిపోయిన చిఛ్ఛు బుడ్డీలా వెలవెలపోతోంది.


తారా జువ్వలా కాంగ్రెస్ :


ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే నాలుగేళ్ల క్రితం ఆరిపోయిన మతాబులా ఉన్న పార్టీ ఇపుడు తారా జువ్వలా ఎగిరిపోవాలనుకుంటోంది. ఆ పార్టీకి నేనున్నాను అంటూ ఏపీలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొండంత భరోసా ఇచ్చాక చిఛ్ఛు బుడ్డీలా చెలరేగిపోతోంది. కొత్త కాంతులు వెదజల్లడానికి  ఆరాటపడుతోంది.


దట్టించిన బాంబులా :


ఇక ఏపీలో ప్రధాన ప్రతిపక్షం  వైసీపీ బాగా దట్టించిన లక్ష్మీ బాంబులా దిట్టంగా ఉంది. ఏ క్షణానైన పేలి ప్రత్యర్ధులను మోతెక్కించాలనుకుంటోంది అంటిస్తే చాలు అంతం చూస్తాను, లక్ష్యం చేదిస్తాను అంటూ ధీమా ప్రదర్శిస్తోంది.  గతంలోలా తుస్సుమనకుండా ఈసారి కస్సుమంటానని హామీ ఇస్తోంది. మరి చూడాలి ఈ బాంబు ప్రతాపం ఏంటో.


సిసింద్రీలా ఆ పార్టీ  :


ఇక ఏపీలో మరో పార్టీ జనసేన సిసింద్రీ  అనుకుంటే ఏకంగా రాజకీయ‌ నాయకుల పంచెల్లో దూరి కలకలం రేపుతోంది. సైజు చిన్నదే అని భావిస్తే కాక రేపుతోంది. ఈ రోజు నుంచి ఇంతింతితై అన్నట్లుగా ఎదిగి బాంబుల వర్షం కురిపిస్తామని, అసలైన దీపావళిని అందరికీ చూపిస్తామని అంటోంది. చూడబోతే ఈ సిసింద్రీ అంత పనీ చేసేలాగానే ఉంది. మరి ఈ రాజకీయ దీపావళి అసలైన తెరపై సూపర్ హిట్ అవుతుందో ఫట్ అవుతుందో నిర్ణయించేది జనం. వచ్చే దీపావళి నాటికి ఏ బాంబు పేలుతుందో, మరే బాంబు ఆరుతుందో  కూడా డిసైడ్ ఐపోతుందిగా.
 


మరింత సమాచారం తెలుసుకోండి: