మహాకూటమిలో సీట్ల సర్దుబాటు సీరియల్ కష్టాల్లాగ కొనసాగుతోంది. కూటమిలోని పార్టీలు ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలన్న విషయంపై అందరూ జుట్లు పట్టుకోవటం ఒక్కటే తక్కువ. దాదాపు పది రోజుల క్రితమే సీట్ల షేరింగ్ గురించి ప్రకటన చేస్తామని ఇప్పటికి పదిసార్లు చెప్పారు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయినా ఇంత వరకూ సమస్య కొలిక్కి రాలేదు. మహాకూటమిలోని సిపిఐ 10 సీట్లడుగుతోంది. మరో పార్టీ టిజెఎస్ 10 సీట్ల కోసం పట్టుపడుతోంది. కూటమిలో కాంగ్రెస్ తర్వాత పెద్ద పార్టీ అయిన తెలుగుదేశంపార్టీ ఏమో 12 సీట్లుకు ఒప్పుకున్నది. కానీ మరో మూడు స్ధానాల కోసం పట్టుబడుతోంది.

 

ప్రతీ పార్టీ కూడా తాము పోటీ చేయబోయే సీట్ల  విషయంలో దేనికదే పట్టుదలగా ఉండటంతో సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి రావటం లేదు. దాంతో మహాకూటమి పార్టీల్లో గందరగోళం చోటు చేసుకుంది. సోమవారం నుండి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతున్న సమయంలో కూడా సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. సమస్యంతా ఎక్కడ వస్తోందటే  తమ స్ధాయికి మించి సీట్లు అడుగుతున్నాయి సిపిఐ, టిజిఎస్. నిజానికి పోయిన ఎన్నికల్లో సిపిఐ ఒక్క సీట్లో కూడా గెలవలేదు. సిపిఐకంటూ నికరంగా పలానా నియోజకవర్గంలో గెలుస్తుందన్న గ్యారెంటీ ఒక్కటి కూడా లేదు.  కానీ పది నియోజకవర్గాలకు కోసం పట్టుపడుతున్నారు.

 

ఇక టిజెఎస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.  టిజెఎస్ పోటీ చేస్తున్నదే మొదటి ఎన్నికలు. దానికి ప్రజల్లో ఉన్న ఆధరణ ఎంతో ఎవరికీ తెలీదు. అందులో ఉన్న వాళ్ళల్లో ఎక్కువమంది ఉద్యమకారులే. టిజెఎస్ కు రంగు, రుచి, వాసన అంతా కోదండరామే. ఉద్యమకారులకు జనాలు ఓట్లేసిన దాఖలాలు చాలా తక్కువనే చెప్పాలి. అటువంటి కోదండరామ్ కూడా పది సీట్లకు డిమాండ్ చేస్తున్నారు. సరే, కాంగ్రెస్, టిడిపిలు పోటీ  చేసే అన్నీ నియోజకవర్గాల్లోను గెలుస్తారా అంటే అది వేరే సంగతి. తమ బలాన్ని అతిగా ఊహించుకుని సిపిఐ, టిజెఎస్ లు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నట్లే అనిపిస్తోంది. దాంతో సీట్ల సర్దబాటు ఇంకా కొలిక్కిరావటం లేదు.

 

సీట్ల పీటముడిపై ఫైనల్ నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ నేతలైన డికె అరుణ, సబితా ఇంద్రారెడ్డి, దామదర రాజనర్సింహ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కబురుచేసింది. వీరితో పాటు పోటీ ఎక్కువగా ఉన్న 15 నియోజకవర్గాల్లోని ఆశావహులను కూడా ఢిల్లీకి రమ్మని పిలుపొచ్చింది. సూర్యాపేట, ములుగు, ఇబ్రహింపట్నం, ధర్మపురి, స్టేషన్ ఘన్ పూర్,  తుంగతుర్తి, రాజంద్రనగర్, దుబ్బాక, మెదక్, పెద్దపల్లి, కోరుట్ల, వరంగల్ ఈస్ట్,  కొత్తగూడెం, నిజామాబాద్ అర్బన్, రూరల్, మేడ్చల్, పటాన్ చెరువు, జుక్కల్ స్ధానాల్లో పోటీ చేసే విషయంలో తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే.

 

మొత్తం మీద తెలంగాణాలోని 119 సీట్లో మిత్రపక్షాలకు 29 సీట్లను కేటాయించటానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. కానీ మిత్రపక్షాలు మరిన్ని సీట్లు అడగటమే ఇబ్బందిగా మారింది. బహుశా ఈరోజు సాయంత్రానికి ఓకొలిక్కి రావచ్చని అనుకుంటున్నారు. దానికితోడు సిపిఐ, టిజెఎస్ లు తాము పోటీ చేయబోయే సీట్లను ప్రకటించేయటం కూడా గందరగోళానికి దారితీసింది. అంటే తామడిగిన సీట్లివ్వకపోతే మహాకూటిమి నుండి తప్పుకుని అన్నీ సీట్లకు పోటీ చేస్తామనే బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నాయి. దాంతో సీట్ల సర్దుబాటు చర్చలు ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. నామినేషన్లు వేసే డేట్ దగ్గరకు వచ్చేస్తున్న ఈ దశలో కాంగ్రెస్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: