తెలుగుదేశంపార్టీ నేతల తీరు చాలా విచిత్రంగా ఉంటోంది. ఏదో ఒక అంశంపై చర్చకు సిద్ధమని ప్రతిపక్ష నేతలను కవ్విస్తారు. ప్రతిపక్ష నేతలు కూడా చర్చకు సవాలుకు ఒప్పుకోగానే వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి అరెస్టులు చేస్తున్నారు. టిడిపి నేతలకు నిజంగానే ధైర్యముంటే ఏ అంశంపైనైనా చర్చకు రావాలి. మధ్యలో పోలీసులను ఎందుకు రంగంలోకి దింపుతున్నారు ? అంటే అధికారపార్టీ నేతల దగ్గర విషయం ఏదైనా కానీ సరుకు లేదని తేలిపోతోంది. అందుకే పోలీసులను అడ్డుపెట్టుకుని నాటకాలాడుతున్నారు.

 

తాజాగా తాడేపల్లిగూడెంలో కూడా జరిగిందదే. తాడేపల్లిగూడెంలో జరిగిన అభివృద్ధి, అవినీతిపైన మాటా మాట పెరిగింది. మాజీ మంత్రి, బిజెపి నేత మాణిక్యాలరావుకు టిడిపి మున్సిపల్ ఛైర్మన్ బాపిరాజుకు మధ్య సవాళ్ళు, ప్రతిసవాళ్ళు మారుమోగిపోయాయి.  పట్టణంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు బాపిరాజు చెబుతుంటే అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని మాణిక్యాలరావు ఎదురుదాడి మొదలుపెట్టారు. అంటే వీరిద్దరికీ మొదటి నుండి కూడా పడదులేండి.

 

సవాలు, ప్రతిసవాలు ఫలితంగా ఈరోజు చర్చకు రెడీ అనుకున్నారు. దాంతో ఉదయమే పోలీసులు మాణిక్యాలరావు ఇంటి వద్దకు వచ్చి మాజీ మంత్రిని ఇంట్లోనుండి బయటకు రానీయకుండా హౌస్ అరెస్టు చేశారు. మాజీ మంత్రి హౌస్ అరెస్టు విషయం తెలియగానే బిజెపి శ్రేణులంతా మాణిక్యాలరావు ఇంటి దగ్గరకు చేరుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హౌస్ అరెస్టు నుండి తప్పించుకున్న మాణిక్యాలరావు రోడ్డుమీదకొచ్చి కార్యకర్తలతో సహా ధర్నాకు దిగారు. దాంతో పోలీసులు మళ్ళీ మాణిక్యాలరావును లాక్కెళ్ళి మళ్ళీ ఇంట్లో పడేశారు. మొత్తం మీద పోలీసులను అడ్డుపెట్టుకుని టిడిపి నేతలు నరసరావుపేట, సత్తెనపల్లి, రాజమండ్రి, విజయవాడ లాంటి చోట్ల డ్రామాలాడుతున్న విషయం అందరూ చూసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: