చంద్రబాబునాయుడంటేనే ఎత్తులు, పై ఎత్తుల రాజకీయం అని అందరికీ తెలిసిందే. ఆయనకు ఎపుడేం చేయాలో తెలుసు, ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలుసు. అందువల్ల ఆయన రాజకీయం జాగ్రత్తగా గమనిస్తేనే తప్ప ఓ పట్టాన అర్ధం కాదు, ఆయన ఎందుకు దగ్గరగా వచ్చి కౌగలించుకుంటారో, మరెందుకు దూరం పెడతారో కూడా తెలియదు. అందులో నిగూఢమైన అర్ధాలు ఎన్నో ఉంటాయి.


కుమార సంభవం :


ఇక చంద్రబాబు జాతీయ స్థాయిలో కూటమి కట్టేందుకు బయల్దేరారు. కర్నాటకలో సీఎం కుమార స్వామి, ఆయన తండ్రి, దేవేగౌడలతో భేటీ వేశారు. ఈ సందర్భంగా బాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్ కి షాక్ తినిపించేలా ఉన్నాయనంటున్నారు. సరిగ్గా పోయిన వారం డిల్లీలో రాహుల్ గాంధితో కరచాలనం చేసి చెప్పిన మాటలకు, చేసిన ప్రకటలకు భిన్నంగా ఈసారి బాబు గొంతు మారిపోయింది. దీంతో హస్తం నేతలు బేజారవుతున్నారు.


మూడవ కూటమిదే అధికారమట :


దేశంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె నుంచి దించేస్తామని  చెబుతున్న బాబు ఆ స్థానంలో మూడవ కూటమి అధికారం చేపడుతుందని కర్నాటక టూర్లో చెప్పడం విశేషం. మూడవ కూటమి అంటే అనేక ప్రాంతీయ పార్టీల కలయిక అన్న మాట. సరిగ్గా 1996న దేశంలో ఏం జరిగిందో ఇపుడు అదే జరుగుతుందని కూడా చెప్పుకొచ్చారు. అంటే అప్పట్లో కాంగ్రెస్ మద్దతు ఇస్తే ప్రాంతీయ పార్టీలు అధికారం చెపట్టాయి. ఈసారి అలాగే పల్లకీ మోసే బోయీ పాత్రలోకి కాంగ్రెస్ మారబోతోందన్నమాట.


రాహుల్ ప్రధాని కలేనా :


యువరాజు రాహుల్ ని చంద్రబాబు ఇలా కలుసుకున్నారో లేదో అలా  ఏపీలో కాంగ్రెస్  నాయకులు పెద్ద నోర్లు చేసుకుని ఓ రేంజిలో సంబరాలు చేసుకున్నారు. రేపటి రోజున ఏపీలో ప్రత్యేక హోదా ఇచ్చేది తమ పార్టీయేనని కూడా చంకలు గుద్దుకున్నారు. రాహుల్ ప్రధాని అవుతారని, తొలి సంతకం పెడతారని కూదా గంభీరమైన ప్రకటనలు చేశారు. మరి ఇపుడు సీన్ చూస్తే రివర్స్ లో వెళ్తోంది. అంటే ప్రాతీయ కూటములే అధికారంలోకి వస్తాయని బాబు అంటున్నారు. మరి రాహుల్ ప్రధాని అన్నది ఉత్త మాటేనా.


ఈ విధంగా ఎక్కడిక్కడ చెప్పడం ద్వారా బాబు తన రాజ‌కీయం తాను చేసుకోవచ్చును కానీ కాంగ్రెస్ వంటి పెద్ద పార్టీని పక్కన పెట్టి ముప్పయి సీట్లు ఉన్న పార్టీలను ముఖ్యమంత్రులు ప్రధానులు చేయాలనుకుంటే ఎన్నాళ్ళు ఆ సర్కార్ ఉంటుందన్నది ఫార్టీ యియర్స్ ఇందస్ట్రీ బాబు గారికి తెలియకుండా ఉంటుందా. పైగా హోదా కోసం కాంగ్రెస్ తో కలిసాం అని చెప్పుకుంటూ అదే కాంగ్రెస్ కు రేపటి రోజుల పవర్  అక్కడ ఇవ్వకపోతే ఇక్కడ హోదా ఎలా వస్తుందో బాబు గారే చెప్పాలి. ఏది ఏమైనా ఈ కూటముల కధలో అపుడో ఎన్నో ట్విస్టులు కనిపిస్తున్నాయంటే బతికి బట్టగలుగుతుందా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: