పెరిగిపోతున్న ఆందోళనతోనే చంద్రబాబునాయుడు బెంగుళూరు, చెన్నైకి పరిగెడుతున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను అదే అనుమానాలు మొదలయ్యాయి. వచ్చే ఎన్నకల్లో కేంద్రంలో మళ్ళీ నరేంద్రమోడి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తన పరిస్ధితేంటి ? ఈ ఆందోళనతోనే చంద్రబాబు దేశంలోని అందరూ నేతల వద్దకు పరుగులు పెడుతున్నట్లు అర్ధమైపోతోంది.


ఆమధ్య ఢిల్లీకి వెళ్ళి జమ్ము, కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ ను కలిసారు. పనిలో పనిగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కూడా భేటీ అయ్యారు. తాజాగా బెంగుళూరుకెళ్ళి కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, తమిళనాడు డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ ను కూడా కలిశారు. దేశంలోనే తనంతట సీనియర్ పొలిటీషియన్ లేడని తనంత అనుభవం ఉన్న రాజకీయ నేత ఇంకోరు లేరని తరచూ చెప్పుకుంటున్న చంద్రబాబు ఇంతమందిని ఎందుకు కలుస్తున్నట్లు ?


రాష్ట్రంలో పాలన పడకేసినా పట్టించుకోకుండా పై నేతల దగ్గరకు వెళ్ళి మరీ భేటీ అవుతున్నారు. తన గురించి తాను చెప్పుకునేది నిజమే అయితే పై నేతలే చంద్రబాబు దగ్గరకు రావాలి కానీ వాళ్ళదగ్గరకు చంద్రబాబు వెళ్ళటం ఏంటి ?  ఎందుకంటే, 30 ఏళ్ళ బద్దశతృవైన కాంగ్రెస్ తో చేతులు కలపగానే చంద్రబాబు ఇమేజి నేలమట్టమైపోయింది. దానికితోడు నరేంద్రమోడితో వ్యక్తిగతంగా చెడిన తర్వాతే చంద్రబాబు జాతీయ స్ధాయి నేతలను కలుస్తున్నారు. మోడితో కలిసి కాపురం చేసినంత కాలం పై నేతల్లో ఎవరినీ చంద్రబాబు పట్టించుకోలేదన్న విషయం గమనార్హం.


రేపటి ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం చాలామంది తమ్ముళ్ళల్లోనే లేదు. దానికితోడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కూడా చంద్రబాబును బాగా డ్యామేజి  చేస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై జరిగిన హత్యాయత్నం ఘటనలో చంద్రబాబు వ్యవహరించిన తీరే అందుకు తాజా ఉదాహరణ.  సో, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మోడి అధికారంలోకి వచ్చి ఇక్కడ జగన్ గనుక సిఎం అయితే తనకు ఇబ్బందులు తప్పవని చంద్రబాబులో ఆందోళన మొదలైనట్లు సమాచారం.


ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత ఐదేళ్ళ పాలనలో అవినీతిపై విచారణ జరక్కుండా, తనపై చర్యలు తీసుకోకుండా ముందు జాగ్రత్తగా జాతీయ నేతల మద్దతు కోసమే చంద్రబాబు వివిధ పార్టీల నేతలను కలుస్తున్నట్లు అనుమానంగా ఉంది. ఇపుడు చంద్రబాబు కలుస్తున్న చాలామంది నేతలతో జగన్ కు కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. కాబట్టి జాతీయ స్ధాయి నేతల పరిచయాలను తనకు రక్షణగా చంద్రబాబు ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: