ఈనెల 11వ తేదీన చంద్రబాబునాయుడు చివరిసారిగా తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. మంత్రవర్గంలో ఖాళీగా ఉన్న రెండు స్ధానాలను ముస్లిం  మైనారిటీ, గిరిజనులతో భర్తీ చేయాలని నిర్ణయించారు. గడచిన నాలుగున్నరేళ్ళుగా చంద్రబాబు మంత్రివర్గంలో ముస్లింలకు, గిరిజనులకు చోటు కల్పించకుండా దేశంలోనే చెత్త రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. పోయిన ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ తరపున పోటీ చేసిన ముస్లిం మైనారిటీలు, గిరిజనుల్లో ఒక్కళ్ళు కూడా గెలవలేదు. మొత్తం ముస్లింలు, గిరిజనులంతా వైసిపి ఎంఎల్ఏలే.

 

దాంతో ఫిరాయింపులకు తెరలేపినపుడు చంద్రబాబు వైసిపికి చెందిన ఇద్దరు ముస్లిం మైనారిటీలు, ఇద్దరు గిరిజన ఎంఎల్ఏలను టిడిపిలోకి లాక్కున్నారు. వారిని టిడిపిలోకి లాక్కునేటపుడు మంత్రి పదవినే హామీ ఇచ్చారు. కానీ టిడిపిలోకి వచ్చిన తర్వాత జలీల్ ఖాన్, గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు కు పెద్ద షాకే ఇచ్చారు. వాళ్ళు ఫిరాయించి చాలా కాలమే అయినా వారికి మంత్రిపదవులు మాత్రం అందని ద్రాక్షపండులాగే మిగిలిపోయింది.

 

ఎలాగూ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. రేపటి ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలు, గిరిజనుల ఓట్లు కొల్లగొట్టాలంటే పై రెండు సామాజికవర్గాలకు మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిన అవసరం వచ్చింది. అందుకనే అత్యవసరంగా మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం నిర్ణయించారు. 11వ తేదీన ఉదయం 11.30 గంటలకు మంత్రివర్గ విస్తరణ ఖాయమైంది. గిరిజనుల్లో ఇటీవలే మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఫిరాయింపు ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావు కొడుకు కిడారి శ్రవణకుమార్, మైనారిటీల్లో ఎన్ఎండి ఫరూక్ కు మంత్రి యోగం ఉందంటున్నారు. ఫరూక్ ప్రస్తుతం శాసనమండలి ఛైర్మన్ గా ఉంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: