అవును నిజంగానే కాంగ్రెస్ నేత వైసిపికి పెద్ద షాకే ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ఈరోజు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ కు రాజీనామా చేయటంలో కొత్తేమీ లేదు. ఎందుకంటే పార్టీకి బాలరాజు రాజీనామా చేస్తారంటూ ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్నదే. కాకపోతే రాజీనామా చేసిన బాలరాజు వైసిపిలో చేరుతారంటూ ఇంత కాలం ప్రచారం జరుగుతోంది. అయితే, తాజాగా రాజుగారి చూపు వైసిపి వైపు కాకుండా జనసేన వైపు చూస్తోందట.

 

బాలరాజు వైసిపిలో చేరుతారని పాడేరు అసెంబ్లీ నుండే పోటీ చేయటం ఖాయమని బాగా ప్రచారం జరిగింది. అటువంటిది కాంగ్రెస్ కు రాజీనామా చేసిన తర్వాత మాత్రం బాలరాజు జనసేనలో చేరుతారనే ప్రచారం మొదలవ్వటంతో వైసిపికి నిజంగా షాకే. ఎందుకంటే, గిరిజనుడైన బాలరాజుకు పాడేరు, అరకు నియోజకవర్గాల్లో గట్టిపట్టుంది. పైగా బాలరాజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రభుత్వంలోనే కాకుండా రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో కూడా మంత్రిగా పనిచేశారు.

 

బాలరాజును పార్టీలో చేర్చుకునేందుకు వైసిపి నేతలు కూడా సుముఖంగానే ఉన్నారు. బాలరాజుకు వైసిపి నేతలకు మధ్య చర్చలు కూడా సానుకూలంగానే సాగినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. మరి తెరవెనుక ఏమి జరిగిందో ఏమో ? బాలరాజు మాత్రం జనసేనలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నారట. బహుశా ఈమధ్యనే కాంగ్రెస్ కు రాజీనామా చేసి జనసేనలో చేరిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కాగ్రెస్ నేతతో మాట్లాడుండొచ్చని సమాచారం. పవన్ తరపున మనోహర్ మాజీ మంత్రికి తగిన హామీ ఇవ్వటం వల్లే జనసేనలో చేరటానికి రంగం సిద్ధమైందని తెలుస్తోంది.  గెలుపోటములను పక్కనపెడితే గిరిజన ప్రాంతాల్లో గట్టిపట్టున్న బాలరాజు జనసేనలో చేరటం వైసిపికి నిజంగా షాకనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: