ఏపీలో బీసీల సంఖ్య చాలాగణనీయంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సగానికి పైగా జనాభా వారిదే. ఓట్లు వారివి, సీట్లు మాత్రం అగ్ర కులాలవి, ఈ రాజనీతి కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. బీసీలను మొదట్లో ఎవరూ పట్టించుకోకపోవడంతో తెలుగుదేశం వచ్చాక ఆ పార్టీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి ఆదరించి అక్కున చేర్చుకున్నారు. నిజమైన అధికారం వారికి ఇస్తూ రాజకీయంగా ముందుకు తీసుకుపోయారు.


మారుతున్న సమీకరణలు :


ఇక ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ వైపు దళితులు, మైనారిటీలు ఉంటే తెలుగుదేశం బీసీలను ముందుంచి రాజకీయం చేస్తూ వచ్చింది. చంద్రబాబు జమానాలో బీసీలకు పదవులు ద‌క్కినా అధికారాలు మాత్రం లేకపోవడంతో వారి ఉనికి నామమాత్రమవుతూ వస్తోంది. ఇక కీలకమైన శాఖలు కూడా అగ్ర వర్ణాల చేతుల్లో ఉంచుకున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. దాంతో బీసీలు తమ రాజకీయ వాటా కోసం చాలాకాలంగా పోరు బాట పడుతూ వస్తున్నారు.


కాపుల సెగ :


ఇదిలా ఉండగా బీసీలకు కాపుల సెగ బాగా తగులుతోంది. ఇప్పటికే అన్ని విధాలుగా అగ్ర భాగాన ఉన్న కాపులను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బీసీల్లో చేర్చేందుకు చంద్రబాబు సర్కార్ అడుగులు వేయడంతో బీసీలు ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. వారిలో అభద్రతాభావం మరింతగా పెరుగుతోంది. ఎప్పటికైనా కాపుల పేరు చెప్పి తమను తీరని అన్యాయం టీడీపీ చేస్తుందన్న బెంగ వారిని కుదురుగా ఉండనీయడంలేదు.


వైసీపీ  వైపుగా :


సరిగ్గా ఇదే సమయంలో ఏపీలో మరో ప్రధాన పార్టీ వైసీపీ బీసీలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. బీసెలకు సమ్మున్నత స్థానం కల్పిస్తామని జగన్ చెప్పడమే కాదు. వారికి ఎక్కువగా సీట్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో కాపుల విషయంలో జగన్ వెనుకంజ వేయడం కూడా బీసీల్లో నమ్మకాన్ని పెంచుతోంది. 


ఈ టైంలో ఏపీ బీసీ కులాల జేఏసీ అధ్యక్షుడు మార్గాన నాగేశ్వరరావు, ఆయన కుమారుడు భరత్ రాం జగన్ పాదయాత్రలో వైసీపీలో చేరడం తో బీసీలు రూటు మారుస్తున్నారని అర్ధమవుతోంది.  మార్గాన కుమారుడు భరత్ రాం కి రాజమండ్రీ ఎంపీ సీటు వైసీపీ ఇస్తుందని జగన్ ప్రకటించడంతో ఆ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పటివరకూ గుత్తాధిపత్యంగా ఉన్న బీసీ ఓటు బ్యాంకు ఇపుడు దారి మళ్ళుతోందని తెలుస్తోంది. ఈ పరిణామాలతో వైసీపీలో కొత్త ధీమా పెరుగుతూంటే అధికార పార్టీలో అలజడి చెలరేగుతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: