చట్టసభల్లో నేరచరితులుండకూడదన్న విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయం లేదు. కానీ అది కాగితాలకు మాత్రమే పరిమితం. మరి వాస్తవమేంటి ? తెలంగాణాలో అసెంబ్లీ స్ధానాలకన్నా నేరచరిత్ర ఉన్న ప్రజా ప్రతినిధుల సంఖ్యే ఎక్కువట. తెలంగాణా అసెంబ్లీలో 119 అసెంబ్లీ సీట్లున్నాయి.  నేర చరిత్రున్న ప్రజాప్రతినిధుల సంఖ్య 67. ఇందులో 46 మంది తీవ్ర అభియోగాలున్నాయట. ఏం చేస్తాం. జనాలు అనుకుంటున్నదొకటి వాస్తవంలో జరుగుతున్నదొకటి. నిజానికి ఇంతమంది నేరచరిత్ర ఉన్న వారు చట్టసభల్లోకి ప్రవేశించగలుగుతున్నారంటే అదుకు జనాలు తమను తామే నిందించుకోవాలి.  ఎన్నికల సమయంలో అభ్యర్ధుల ప్రలోభాలకు లొంగిపోయి ఓట్లేస్తున్న కారణంగానే నేరచరిత్రున్న వారు నర్భయంగా చట్టసభల్లో కూర్చుంటున్నారు.

 

67 మంది నేరచరిత్ర ఉందని ఎవరో చెప్పటం కాదు. తమపై ఉన్న కేసులను, వాటి వివరాలను పోయిన ఎన్నికల్లో వారంతట వారే ఎన్నికల సంఘానికి అఫిడవిట్ ద్వారా అందించారు. కాకపోతే అవి బహిర్గతం కావటం లేదు కాబట్టే దర్జాగా తిరిగేస్తున్నారు.  నేరచరిత్రున్న ప్రజాప్రతినిధుల్లో కూడా టిఆర్ఎస్ ఎంఎల్ఏలదే పెద్ద షేర్. ఎంతైనా అధికారంలో ఉన్న పార్టీ కదా ? ఆమాత్రం చరిత్ర లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి ? మొత్తం 67 మందిలో 41 మంది టిఆర్ఎస్ ఎంఎల్ఏలపై క్రిమినల్ కేసులే ఉన్నాయట. ఇంతమందిని పార్టీలోను, చట్టసభలోను పెట్టుకుని బంగారు తెలంగాణా సాధిస్తానని కెసియార్ చెప్పటమే పెద్ద జోక్. విచిత్రమేమిటంటే, నకిరేకల్ ఎంఎల్ఏ వేముల వీరేశంపై హత్యానేరం కేసు, మంథని ఎంఎల్ఏ పుట్టా మధుకర్ పై కిడ్నాప్ కేసు విచారణలో ఉంది.

 

టిఆర్ఎస్ ఎంఎల్ఏల తర్వాత షేర్ కాంగ్రెస్ ఎంఎల్ఏలదే. కాంగ్రెస్ నుండి 21 మంది ఎంఎల్ఏలుంటే అందులో 7 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఇందులో షబ్బీర్ ఆలీ, రేణుకా చౌదరి పై ఉన్న కేసులు రాజకీయ కోణంలో పెట్టినవని పార్టీ చెబుతోంది.  ఇక కేసులు ఎదుర్కొంటున్న వారిలో టిపిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు.  2014 ఎన్నికల్లో కారులో రూ 2 కోట్లు దొరికాయనే కేసును ఉత్తమ్ ఎదుర్కొంటున్నారు. హౌసింగ్ కుంభకోణంపై సిఐడి విచారణ జరుగుతోంది.

 

మరో సీనియర్ నేత జానారెడ్డిపైన కూడా కేసులున్నాయి. వ్యాపార లావాదేవీలు, ఆస్తులపై ఈడి అంతర్గత విచారణను ఎదుర్కొంటున్నారు. గనుల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడినట్లు మరో సీనియర్ నేత డికె అరుణ కూడా సిబిఐ కేసు ఎదుర్కొంటున్నారు. ఎంఆర్ భూముల కుంభకోణం కేసులో మాజీ మంత్రి గీతారెడ్డి విచారణను ఎదుర్కొంటున్నారు. ఎంబిసి జ్యువెలర్స్ అక్రమ లావాదేవీల కేసులో షబ్బీర్ ఆలీపై సిబిఐ కేసు నడుస్తోంది. ఇక రేవంత్ రెడ్డి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రేవంత్ పై నోటుకు ఓటు, అక్రమాస్తులు, మనీల్యాండరింగ్ పై ఈడి, ఐటి కేసులున్నాయి.

 

ఇక, మనుషుల అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి అరెస్టయిన విషయం అందరికీ తెలిసిందే. 14 రోజులపాటు జగ్గారెడ్డి రిమాండ్ లో కూడా ఉండి వచ్చారు. సుశీ ఇన్ఫ్రా కాంట్రాక్టుల అక్రమ లావాదేవీల ఆరోపణలపై కోమటిరెడ్డి బ్రదర్స్ పై కూడా కేసులున్నాయి. గండ్ర వెంకటరమణారెడ్డిపై అక్రమ ఆయుధాల కేసు, కూన శ్రీశైలంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అన్నింటికన్నా పెద్ద విషయం ఏమిటంటే కెసియార్ పైనే రెండు కేసులున్నాయి. అందులో ఒకటి తీవ్రమైనదట.

 

ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులు పై కేసులకు బోనస్ లాంటివి లేండి. ఇక టిడిపి, ఎంఐఎంలు తక్కువేమీ తినలేదు. టిడిపి నుండి గెలిచిన 15 మంది ఎంఎల్ఏల్లో 9 మందిపైన కేసులున్నాయి. ఇక, ఎంఐఏం తరపున గెలిచిన ఏడుగురిలో ఐదుమందిపైన, 5 మంది బిజెపి ఎంఎల్ఏల్లో ఒకరిపైన కేసుంది. మరి రేపటి అసెంబ్లీలోకి ఎంతమంది నేరచరితులు ప్రవేశిస్తారో చూడాలి. చూశారా బంగారా తెలంగాణా ఎంత బాగుందో ?


మరింత సమాచారం తెలుసుకోండి: