ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించుకున్న కొత్తల్లో కెసియార్ ప్రత్యర్ధులపై ఎగిరెగిరి పడేవారు. చంద్రబాబునాయుడుపై అయితే మరీ నోరుపారేసుకునే వారు. అలాంటిది ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో మూతపడిపోయింది. ఎందుకు నోరు మూతపడిపోయింది ? ఇపుడిదే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. ఒక్క కెసియార్ అనే కాదు, కెటియార్, హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా అవసరమున్నా లేకపోయినా చంద్రబాబును అమ్మనాబూతులు తిట్టి తమ నీటి తీటను వదిలించుకునే వాళ్ళు. పనిలో పనిగా టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ కో ను కూడా తిట్టని రోజంటూ లేదు.

 

దాదాపు నెలన్నర రోజుల క్రిందట చంద్రబాబును కెసియార్ అన్నేసి మాటలంటుంటే విన్నవాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇప్పుడే ఇంతలా ఒంటికాలిపై లేస్తుంటే అసలు ఎన్నికల ప్రక్రియ మొదలైతే ఇంకెలా రెచ్చిపోతారో అని అనుకున్నారు. అయితే, అందరూ అనుకున్నట్లు కెసియార్ చెలరేగిపోలేదు. పైగా అసలు నోరే ఎత్తటం లేదు. దాంతో జనాలందరూ ఇఫుడు రెండోసారి కూడా ఆశ్చర్యపోతున్నారు. కెసియార్ వైఖరిపై ఆరాతీస్తే టిఆర్ఎస్ వర్గాలు కొన్ని విషయాలు చెప్పారు. అదేమిటంటే, కాంగ్రెస్ ను ఈజీగా ఓడించవచ్చని అనుకున్నారు.

 

రెండో కారణమేమిటంటే, టిడిపిది ఒంటరి పోరే కాబట్టి అసలు లెక్కలోకి కూడా తీసుకోనక్కర్లేదని. మూడో పాయింటేమిటంటే ,  టిజెఎస్ ఎవరితోను కలవలేందు కాబట్టి అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదనేది కెసియార్ భావన. అయితే, కెసియార్ అంచనాలకు భిన్నంగా కాంగ్రెస్, టిడిపి, టిజెఎస్, సిపిఐ కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. దాంతో కెసియార్ కంగుతినాల్సొచ్చింది. కాంగ్రెస్, టిడిపిలు కలవగానే కెసియార్ లో కలవరం స్పష్టంగా కనపించింది. అందుకనే నోటికొచ్చినట్లు మాట్లాడారు. కెటియార్, హరీష్ లను పురమాయించి ఇప్పటికీ కాంగ్రెస్, టిడిపి కలయికపై తిట్టిస్తునే ఉన్నారు. సరే వీళ్ళేమనుకున్నా మనకేంటనుకునే పై రెండు పార్టీలు కలిసిపోయాయి. ఇప్పటికి 25 రోజులుగా కెసియార్ గొంతే ఎక్కడా వినిపించటం లేదు.

 

అదే సమయంలో 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఒకేసారి ప్రకటించానని కెసియార్ గొప్పగా చెప్పుకున్నారు కానీ ఆ గొప్పలే ఇఫుడు తిప్పలు తెచ్చిపెట్టాయి. కెసియార్ మొదటిజాబితాలో ప్రకటించిన 105 నియోజకవర్గాల్లో కనీసం 40 చోట్ల అభ్యర్ధులు నేతల నుండి జనాల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అంటే ఒకవైపు మహాకూటమి నుండి ఒత్తిడి మరోవైపు సొంత అభ్యర్ధులపైనే బయటపడుతున్న వ్యతిరేకత. దాంతో కెసియార్ కు ముందు సొంతింటిని చక్క పెట్టుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. పక్కింటికి నిప్పుపెట్టి ఆనందిద్దామనుకుంటే అదికాస్త తన ఇంటిని కూడా కాల్చేసిందన్న చందంగా తయారైంది కెసియార్ వ్యవహారం. అందుకే ముందు సొంతింటిని చక్కదిద్దుకునే బిజిలో ఉండి చంద్రబాబు, ఉత్తమ్ అండ్ కోను పట్టించుకోవటం మానేశారు.

 

రేపటి ఎన్నికల్లో మహాకూటమి  గెలుస్తుందా ? లేకపోతే టిఆర్ఎస్ గెలుస్తుందా అన్న విషయాన్ని పక్కనపెడదాం. ప్రత్యేక తెలంగాణా తెచ్చారన్న ఊపులోనే కెసియార్ కు 2014లో జనాలిచ్చింది 64 సీట్లు. మరి నాలుగున్నరేళ్ళ పాలనలో అభివృద్ధిలో, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణాను దేశంలోనే నెంబర్ 1 గా నిలబెట్టినట్లు పదే పదే చెప్పుకున్నారు. కెసియార్ చెప్పిందే నిజమైతే అసలు ప్రత్యర్ధులను పట్టించుకోవాల్సిన పనేలేదు. అయినా ఎందుకంతలా నోరు పారేసుకున్నారు ?

 

కెసియార్ తన భుజాలను తాను ఎంతగా చరుచుకున్నా ప్రభుత్వంపై జనాల్లో మిశ్రమ స్పందనే కనిపిస్తోంది. మరి ఈ పరిస్ధితుల్లో కెసియార్ చెప్పినట్లుగా 100 సీట్ల మార్కు దాటగలరా ? గ్రౌండ్ రియాలిటీని బట్టి చూస్తుంటే చాన్సే లేదని అర్ధమైపోతోంది. మహాకూటమిలోని పార్టీల మధ్య ఓట్ల ట్రాన్సఫర్ సరిగ్గా జరిగితే పోయిన ఎన్నికల్లో వచ్చిన సీట్లతోనే కెసియార్ రేపు కూడా సరిపెట్టుకోవాల్సొస్తుందనటంలో సందేహం లేదు. అదే నిజమైతే కెసియార్ ఫెయిల్ అయినట్లే. ఎవరికైనా ఎనీ డౌట్ ?


మరింత సమాచారం తెలుసుకోండి: