వచ్చే ఫిబ్రవరిలోనే ఏపిలో కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతోందా ? అవుననే సమధానం చెబుతున్నారు ఎన్నికల ప్రధాన అధికారి సిసోడియా. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, ఫిబ్రవరి మూడోవారంలో ఏపిలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పారు. అంటే దీన్ని ముందస్తు ఎన్నికలు అనేందుకు అవకాశం లేదనుకోండి. అయితే, షెడ్యూల్ ఎన్నికలు మేనెలలో జరగాలి. కాకపోతే మే నెల కన్నా కాస్త ముందుగా జరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి మూడో వారంలో షెడ్యూల్ విడుదలవుతోందంటే బహుశా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

 

రాష్ట్రంలో కొత్తగా 30 లక్షల మంది కొత్తగా ఓటును నమోదు చేసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.75 కోట్లమంది ఓటర్లున్నారట. అయితే, రాష్ట్రంలో 52 లక్షల దొంగ ఓట్లున్నట్లు ఈమధ్యనే జన చైతన్య వేదిక విడుదల చేసిన వివరాలపై మాత్రం సిసోడియా ఏమీ మాట్లాడలేదు. దశలవారీగా వివి ప్యాట్లు రాష్ట్రానికి తీసుకురానున్నట్లు చెప్పారు. ఈవిఎంల ప్రత్యేక రక్షణకు ఏర్పాట్లు చేసేందుకు భెల్ కంపెనీకి ఇక్కడి ఉద్యోగులను పంపిస్తున్నట్లు చెప్పారు. సిసోడియా చెప్పటం చూస్తుంటే షెడ్యూల్ ఇంకా ముందే వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

 

ఇప్పటికే ఏపిలో ఎన్నికల వేడి పెరిగిపోయిన విషయం అందరూ చూస్తున్నదే. జగన్ పాదయాత్రతో ఎన్నికల హీట్ పెంచేస్తున్నారు. అదే సమయంలో అధికార తెలుగుదేశంపార్టీ కూడా ఏదో ఓ కార్యక్రమంతో జనాల్లోకి చొచ్చుకుని పోతోంది. రెండు ప్రధాన పార్టీలు జనాల్లోకి వెళ్ళిపోవటంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ప్రజా పోరాట యాత్ర పేరుతో జనాల్లోనే తిరుగుతున్నారు. సో, ఇఫుడు ఎన్నికల ప్రధాన అధికారి కూడా షెడ్యూల్ విడుదల గురించి చెప్పటంతో ఎన్నికల హీట్ మరింత పెరిగిపోవటం ఖాయమనే అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: