మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఆమధ్య విశాఖపట్నం జిల్లాలో భారీ భూ కుంభకోణం వెలుగు చూసిన విషయం తెలిసిందే. దానిపై సిట్ అందించిన నివేదికను మంత్రి తప్పుపడుతున్నారు. ఉద్దేశ్యపూర్వకంగా కొందరు పెద్దలను రక్షించేందుకే సిట్ వేసి తమకు కావాల్సినట్లుగా నివేదికను తెప్పించుకున్నట్లు మంత్రి మండిపోతున్నారు. అదే విషయాన్ని చింతకాయల బాహాటంగానే చెప్పేస్తున్నారు. తాజాగా చింతకాయల మాటలను బట్టి అదే విషయం అర్ధమవుతోంది.

 

భూ కుభకోణం విషయంలో సిట్ ఇచ్చిన నివేదికపై మంత్రి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఒత్తిడి వల్లే తాము నివేదికను అలా తయారు చేయాల్సి వచ్చిందని తనతో చెప్పినట్లు మంత్రి చెప్పటంతో పార్టీలో కలకలం మొదలైంది. అంతటితో ఆగితే ఆయన చింతకాయల ఎందుకవుతారు ? తనతో మాట్లాడిన ఉన్నతాధికారులు కూడా పెద్దవాళ్ళు చెప్పినట్లే తాము నివేదికను తయారు చేయాల్సొచ్చిందని అంగీకరించినట్లు అయ్యన్నపాత్రుడు బయటపెట్టారు. అంతేకాకుండా కుంభకోణంలో ఉన్న పెద్దల పాత్ర ఏమిటో ? ఆ పెద్దలెవరో కూడా బయటపెట్టాలంటూ మంత్రి తాజాగా డిమాండ్ చేయటంతో చంద్రబాబుకు తలనొప్పులు మొదలయ్యాయి.

 

ఇంతకీ విషయం ఏమిటంటే, భూ కుంభకోణంలో ప్రధాన సూత్రదారుడు సహచర మంత్రి గంటా శ్రీనివాసరావే అని అందరిలోను అనుమానాలున్నాయి. అదే విషయాన్ని అప్పట్లో చింతకాయల మాట్లాడుతూ, కుంభకోణంలో ప్రధాన పాత్ర గంటాదే అంటూ పెద్ద బాంబే పేల్చారు. గంటాతో పాటు టిడిపికి చెందిన ఆరుగురు ఎంఎల్ఏలున్నట్లు కూడా చింతకాయల కుండబద్దలు కొట్టారు. అంతేకాకుండా సిట్ విచారణకు హాజరై తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను కూడా అందించారు.

 

సరే తర్వాత తెర వెనకాల ఏమైందో ఏమో మళ్ళీ చింతకాయల కుంభకోణంపై ఏమీ మాట్లాడలేదు. సిట్ నివేదిక బయటకు వచ్చిన నేపధ్యంలో మళ్ళీ చింతకాయల నోరిప్పారు. జిల్లా రాజకీయాల్లో గంటాకు, చింతకాయలకు అస్సలు పడదన్న విషయం అందరికీ తెలిసిందే. గంటా ఏమో అవసరానికి తగ్గట్లు పార్టీలు మరుస్తుంటే చింతకాయలేమో టిడిపినే అంటిపెట్టుకున్నారు. అయితే, బయటనుండి ఎప్పుడు టిడిపిలోకి వచ్చినా ఆధిపత్యం మాత్రం గంటాదే అవుతోంది. దాంతో చింతకాయల మండిపోతున్నారు.

 

కుంభకోణానికి సంబంధించి చింతకాయల లేటెస్టు ప్రకటన కూడా అందులో భాగమే. అప్పట్లో ఇదే కుంభకోణానికి సంబంధించి ప్రతిపక్షాలు జిల్లాలో ఏ స్ధాయిలో ఆందోళనలు చేశాయో అందరికీ తెలిసిందే. పైగా భూ రికార్డులు కూడా మాయమైపోయాయని చింతకాయల చెప్పటం బట్టే పాత్ర ఎవరిదో అర్ధమైపోతోంది. ఎందుకంటే, అధికార పార్టీ పెద్దల పాత్ర లేకుండానే రెవిన్యు రికార్డులు మాయమవ్వటం, తారుమారవ్వటం జరగదుకదా ? నివేదికలో అయితే కుంభకోణంలో తన పాత్ర లేదని తప్పించుకున్నా ఎన్నికల్లో అయితే అదే గంటాకు ప్రతికూలమయ్యే అవకాశాలే కనబడుతున్నాయి. మరి అప్పుడు చింతకాయల ఏం చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: