పండగ‌ వస్తోందంటే ఇల్లు అలుకుతారు, ముగ్గులు పెడతారు. తోరణాలు కడతారు. రాజకీయ నాయకులకు పండగ అంటే ఎన్నికలే. మళ్ళీ తమ పార్టీ గెలవాలని, అధికార పీఠం దక్కాలని పార్టీలు ఎన్నో  పధకాలు వేస్తాయి. కొత్త ఎత్తులు, పొత్తులతో రెడీ అయిపోతాయి. ఏపీలో చూడబోతే సీన్ మొత్తం ఇపుడు అలాగే కనిపిస్తోంది.


ముస్తాబు అయిపోతున్నారు :


ఎన్నో ఎన్నికల్లో ఆరితేరిన అనుభవం చంద్రబాబుకు ఉంది. ఆయన గెలుపులోనే అంతా చూస్తారు. అందుకోసం ఏమైనా చేస్తారని ప్రచారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి అవసరమైన అస్త్ర శస్త్రాలు ఆయన సమకూర్చుకుంటున్నారు. జాతీయ పార్టీ బీజేపీతో విడాకులు ఇచ్చాక మెరుపు వేగంతో మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ ని కావలించుకున్నారు.  పైగా జాతీయ స్థాయిలో మారుతున్న సమీకరణలు అనుకూలం చేసుకుంటున్నారు. ఇలా రచ్చ గెలిచే పనులు చాలానే చేశారు.


ఇంటిని చక్కబెడుతున్నారు :


ఇపుడు టీడీపీలోని లోపాలను, పాపాలను కడిగేసుకునే పనిలో పడ్డారు. ముస్లిం మైనారిటీలను అక్కున చేర్చుకునేందుకు ఆ వర్గానికి మంత్రిని ఇచ్చిన బాబు, గిరిజనుల మెప్పు కోసం కిడారి శ్రావణ్ కి పదవి కట్టబెట్టారు. పార్టీలో పనిచేయని వారిని గుర్తించి పక్కన పెట్టే కార్యక్రమం ఓ వైపు జోరుగా సాగుతోంది. మరో వైపు రేపటి ఎన్నికల్లో ఆర్ధికంగా సాయం చేసే మంత్రులు, నాయకులను ఇపుడు దగ్గరకు తీస్తున్నారు. వారి మీద ఏ కేసులు, ఆరోపణలు లేకుండా క్లీన్ చీట్ ఇచ్చేస్తున్నారు.


పునాది రాళ్ళతో మమ :


ఇక ఏపీలో నాలుగున్నరేళ్ళుగా ఊరిస్తున్న అనేక కీలక ప్రాజెక్టులకు  అతీ గతీ లేదు. ఎన్నికల వేళ మళ్ళీ పునాది రాళ్ళు వేయడానికి బాబు బయల్దేరుతున్నారు. ఉత్తరాంధ్రాకు పదేళ్ళ నాటి కల సుజల స్రవంతి సాగు, తాగు నీటి ప్రాజెక్ట్ కి బాబు ఈ రోజు విశాఖ జిల్లా చోడవరంలో శంకుష్తాపన చేస్తున్నారు. ఆలగే విశాఖకు మెట్రో ప్రాజెక్ట్ కాగితాల మీద ప్రకటించి కూత పెట్టించేశారు.
 ఇలా ఈ ప్రాంతం ఓట్లను మళ్ళీ అడిగేందుకు పూర్వరంగం బాబు సిధ్ధం చేశారు. ఇంకో వైపు కడప స్టీల్ ప్లాంట్ కి కూడా పునాది రాయి రేపో మాపో వేయబోతున్నారు. ఇక డిసెంబర్లో మహా కూటమి తెలంగాణాలో పవర్లోకి వస్తే బాబు దూకుడు మరింత పెరుగుతుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: