నందమూరి కుటుంబంతో చంద్రబాబునాయుడు రాజకీయాలు ఆడటం ఇంకా పూర్తి కాలేదు. తెలంగాణా ఎన్నికల్లో భాగంగా తాజాగా మరో అంకానికి తెరలేపారు. కుకట్ పల్లి నియోజకవర్గంలో సుహాసినిని పోటీలోకి దింపటం ద్వారా మరోమారు నందమూరి ఫ్యామిలీతో చంద్రబాబు ఆడుకుంటున్నారు. నందమూరి సుహాసిని అంటే ఎవరో కాదు. దివంగత నేత నందమూరి హరికృష్ణ కూతురు. నిన్నటి వరకూ సుహాసిని ఎవరో ఎవరికీ తెలీదు. ఎన్నికల్లో కుకట్ పల్లి నుండి ఎవరిని పోటీ చేయించాలన్న అంశం వచ్చినపుడే సుహాసిని  పేరు వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే చంద్రబాబు అనుమతితో సీనియర్ నేత పెద్దిరెడ్డి కుకట్ పల్లిలో పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. అయితే, చివరి నిముషంలో పెద్దిరెడ్డికి హ్యాండిచ్చి సుహాసినిని చంద్రబాబు పోటీలోకి దింపారు.

 

అందరిలోను ఇక్కడే ఓ అనుమానం వస్తోంది. నిజంగా నందమూరి కుటుంబంపై చంద్రబాబుకు అంత ప్రేమే ఉంటే ఏపి ఎన్నికల్లోనే పోటీలోకి దింపవచ్చు కదా ? టిడిపికి కంచుకోటలుగా పేరున్న నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఏదో ఒక నియోజకవర్గం నుండి ఆమెను పోటీలోకి దింపి గెలిపించుకోవచ్చు. లేదా హిందుపురం నియోజకవర్గం నుండైనా దింపవచ్చు. ఏపిలో సుహాసినిని పోటీ చేయిస్తే ఆమెను అడ్డుకునే వారు కూడా ఎవరూ ఉండరు. పైగా నందమూరి కుంటుంబంపై తెలంగాణాలో కన్నా ఏపిలోనే ఎక్కువ అభిమానులున్న విషయం తెలిసిందే. అంతెందుకు టిడిపి వ్యవస్ధాపకుడు అన్నగారు ఎన్టీయార్ పుట్టి పెరిగిన గుడివాడ నియోజకవర్గమే ఉంది కదా ?

 

ఏపిలో అనేక నియోజకవర్గాలుండగా వాటన్నింటినీ కాదని తెలంగాణాలోని కుకట్ పల్లి నియోజకవర్గంలోనే ఎందుకు పోటీ చేయిస్తున్నారు ? అంటే ఇక్కడ సెటిలర్లు ఎక్కువగా ఉన్నారట. విచిత్రంగా లేదు టిడిపి నేతల వాదన. కుకట్  పల్లిలో సెటిలర్లుంటే ఉన్న వారంతా టిడిపికే ఓట్లు వేయాలని ఏముంది ? పైగా ఇక్కడ నుండి టిఆర్ఎస్ తరపున తాజా మాజీ ఎంఎల్ఏ మాధవరం కృష్ణారావు పోటీలో ఉన్నారు. అంటే సుహాసిని ఇక్కడి నుండి పోటీ చేస్తే గెలుపుపై చివరి నిముషం వరకూ అనుమానమే.


అదే ఏపిలో టిడిపికి పట్టున్న ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా గెలుపుపై నమ్మకం పెట్టుకోవచ్చు. నందమూరి వారసులు పోటీ చేస్తున్నారంటే టిడిపి యంత్రాంగం మొత్తం గెలుపుకోసం పనిచేస్తుంది. అదే తెలంగాణాలో అవకాశాలు తక్కవ. ఎందుకంటే, తెలంగాణాలో టిడిపి దాదాపు నేలమట్టమైపోయింది. పైగా అధికారంలో కెసియార్ ఉన్నారు. గెలుపుకు ఏపిలో పోటీ చేసినపుడు ఉండే స్వేచ్చ తెలంగాణా ఎన్నికల్లో ఉండదు. కాబట్టి ఏ విధంగా చూసినా సుహాసిని తెలంగాణాలో పోటీ చేయటం కన్నా ఏపిలో పోటీ చేయటమే సబబు అనిపిస్తోంది. ఒకవేళ గెలిచినా మళ్ళీ కెసియార్ అధికారంలోకి వస్తే సుహాసిని చేయగలిగేది కూడా ఏమీ ఉండదు.


ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, హరికృష్ణ బతికున్న రోజుల్లో చంద్రబాబు ఆయన్ను పూర్తిగా దూరం పెట్టేశారు. ప్రభుత్వం నుండే కాదు చివరకు పార్టీ వ్యవహారాల్లో కూడా వేలు పెట్టేందుకు లేకుండా చేశారు. ఆ కోపంతోనే హరికృష్ణ చివరకు పాలిట్ బ్యూరో సమావేశాలకు కూడా హాజరుకావటం మానుకున్నారు. అంటే బతికున్న రోజుల్లో హరికృష్ణను దూరం పెట్టేసిన చంద్రబాబు ఆయన మరణం తర్వాత కూతురుకు టిక్కెట్టివ్వటంలో అర్ధమేంటి ? ఏపి ఎన్నికల్లో మళ్ళీ హరికృష్ణ కుటుంబాన్ని వాడుకోవాలనే కదా ? హరికృష్ణ కుటుంబంపై ప్రధానంగా అందరికీ గుర్తుకువచ్చేది జూనియర్ ఎన్టీయారే. చంద్రబాబుకు జూనియర్ కు సఖ్యత లేదు. అందుకనే హరికృష్ణ కుటుంబంపై పట్టు బిగించేందుకు కూతురు సుహాసిని ద్వారా చంద్రబాబు పావులు కదుపుతున్నారనే అనుమానాలు మొదలయ్యాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: