సిబిఐ విచారణకు సంబంధించి తాజాగా చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయం హైకోర్టుకు ప్రిస్టేజిగా మారిపోయిందా ? విచారణలో ఉన్న జగన్ హత్యాయత్నం కేసులో కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయంపై అందరిలోను ఉత్కంఠ పెరిగిపోయింది. రాష్ట్రంలో సిబిఐను అడ్డుకుంటూ ప్రభుత్వ జారీ చేసిన ఉత్తర్వుపై అన్నీ వైపుల నుండి విమర్శలు వస్తున్న సంగతి అందరూ చూస్తున్నదే. అయినా చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకునేట్లు కనబడటం లేదు.  అసలు హఠాత్తుగా సిబిఐకి నో ఎంట్రీ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది చంద్రబాబుకు ? ఏమొచ్చిందంటే జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనే కారణమంటున్నారు అందరూ.

 

పోయిన నెల 25 తేదీన విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై హత్యాయత్నం జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. దానిపై ఇటు జగన్ అండ్ కో అటు చంద్రబాబునాయుడు అండ్ కో మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతోంది. తనపై హత్యాయత్నం జరిగిందంటూ జగన్ ఆరోపిస్తున్నారు. సానుభూతి కోసం తనపై తానే జగన్ దాడి చేయించుకున్నారంటూ చంద్రబాబు కొట్టిపారేస్తున్నారు. అందుకు డ్రామా విషయాన్ని తేల్చేస్తామంటూ చంద్రబాబు సిట్ విచారణను ఏర్పాటు చేశారు. అయితే, సిట్ విచారణపై తమకు నమ్మకం లేదంటూ జగన్ థర్డ్ పార్టీ విచారణను డిమాండ్ చేస్తు కోర్టులో కేసు వేశారు.

 

జగన్ లెక్కలో థర్డ్ పార్టీ అంటే సిబిఐ కానీ లేకపోతే జ్యుడీషియరీ విచారణ. ఇఫ్పటి వరకూ జరిగిన విచారణలో జగన్ వాదనతో కోర్టు కూడా ఏకీభవించినట్లే అనిపిస్తోంది. అందుకనే చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు సమాధానం చూసిన తర్వాత విచారణ జరిపించే విషయంలో హైకోర్టు ఏదో ఓ నిర్ణయం తీసుకుంటుంది. సిబిఐ విచారణ జరిపించేందుకే అవకాశాలు ఎక్కువున్నట్లు బహుశా చంద్రబాబు అనుమానిస్తున్నట్లున్నారు.  అందుకే హఠాత్తుగా రాష్ట్రంలోకి సిబిఐ ఎంట్రీని అడ్డుకుంటూ జీవో విడుదల చేశారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా గోల మొదలైంది.

 

సరే, బయట జరిగే గోల ఎలాగున్న దాని ప్రభావం హైకోర్టు మీద కూడా పడేట్లే కనబడుతోంది. ఇపుడు హై కోర్టు గనుక సిబిఐ విచారణకు ఆదేశిస్తే ఏమవుతుంది ? ఒకవేళ ప్రభుత్వ ఉత్తర్వలను పరిగణలోకి తీసుకుంటే జగన్ వాదనను కోర్టు కొట్టేయాలి. అపుడు చంద్రబాబుదే పై చేయవుతుంది. నిజానికి ప్రభుత్వ ఉత్తర్వులేవి కోర్టు నిర్ణయాన్ని అడ్డుకోలేవు. హైకోర్టు గనుక సిబిఐ విచాణకు ఆదేశిస్తే చంద్రబాబు విడుదల చేసిన జీవో ఎందుకు పనికిరాదు. ప్రభుత్వ అనుమతితో పనిలేకండానే సిబిఐ విచారణ ప్రారంభించవచ్చు.

 

ఈ నేపధ్యంలోనే అందరి దృష్టి ఇపుడు హైకోర్టు తీసుకోబోయే నిర్ణయం మీద పడింది. సిబిఐ విచారణకు ఆదేశించటం హై కోర్టుకు కూడా ప్రిస్టేజిగా మారిపోయిందని న్యాయనిపుణులే చెబుతున్నారు. చంద్రబాబు జారీ  చేసిన ఉత్తర్వు కేవలం ఓ చిత్తు కాగితమే అని హై కోర్టు కూడా భావిస్తే వెంటనే సిబిఐ విచారణకు ఆదేశిస్తుందని పలువురు భావిస్తున్నారు. కోర్టు గనుక సిబిఐ విచారణకు ఆదేశిస్తే అపుడు చంద్రబాబు ఏం చేస్తారు ? మొన్నటి వరకూ జగన్ సిట్ విచారణను అంగీకరించనని చెప్పినట్లే రేపు సిబిఐ విచారణకు సహకరించనని చెబుతారా ? అంత ధైర్యం చేయగలరా ? ఒకవేళ చెబితే అపుడు హై కోర్టు ఏం చేస్తుంది ? ఈ ప్రశ్నలే ఇఫుడు అందరి బుర్రలను తొలిచేస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో ?


మరింత సమాచారం తెలుసుకోండి: