కాపు ఉద్యమ నాయకుడిగా పేరు గడించిన ముద్రగడ పద్మనాభం ఇపుడు ఏం చేయబోతున్నారు. కాపులకు రిజర్వేషన్లు ఉండాలన్న డిమాండ్ తో ఏపీ రాజకీయాలను ఓ కుదుపు కుదిపిన ఆయన కీలక సమయంలో అనుకున్నంత జోరు ప్రదర్శించలేకపోతున్నారా. ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో ధాటీగా ఉండాల్సిన చోట గొంతు ఎందుకు చిన్నదైపోతోంది. దీని వెనక కూడా  ఏదైనా వ్యూహం ఉందా. 


ఆయుధం వాడేశారా:


ముద్రగడ పద్మనాభం ఏపీ రాజకీయాలను ఈ మధ్య కాలం వరకూ గడగడలాడించారు. ఆయన దీక్షకు కూర్చుంటానంటే చాలు చంద్రబాబు ప్రభుత్వం హడలిపోయేది. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో బాబుకు అసలైన ప్రతిపక్షం ముద్రగడ అనేంతగా ఉండేది. వచ్చే ఎన్నికలను ముద్రగడ డిసైడ్ చేస్తారన్నంతగా ఆయన జోరు అప్పట్లో సాగింది. అయితే సరైన వ్యూహలు రచించడంలో వైఫల్యంమో లేక అన్ని ఆయుధాలూ ఒకేసారి వాడేసిన ఫలితమో తెలియదు కానీ ఎన్నికల నాటికి ముద్రగడ పూర్తి నిర్వేదంలో పడినట్లుగా ఉంది.


మళ్ళీ అక్కడికే :


ముద్రగడ తన ప్రస్థానం ఎక్కడ ప్రారంభించారో మళ్ళీ అక్కడికే వచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాపుల రిజర్వేషన్ డిమాండ్ అమలు చేసిన వారికే తమ మద్దతు ఉంటుందని తాజాగా ఆయన చెప్పుకొస్తున్నారు. నిజానికి ఈ పాటికి ముద్రగడ కాపుల డిమాండ్ ని అన్ని పార్టీలు అజెండాగా చేసేలా పరిస్థితి తీసుకురావాల్సింది. అటువంటిది. ఎవరైన చేస్తే మద్దతు ఇస్తామంటూ పాత పాట పాడడం వెనక ఉధ్యమ వైఫల్యం కచ్చితంగా కనిపిస్తోంది. అతి చేయడం, రాజకీయ ఎత్తుగడలు లేకపోవడం వల్లనే ముద్రగడ తో పాటు కాపుల ఉద్యమం కూడా ఇపుడు డీలా పడిందా అన్న అనుమానాలు వస్తున్నాయి.


ప్రతిపక్షం దూరం :


నిజానికి కాపుల రిజర్వేషన్ అన్న మాట వింటేనే రాజకీయ పార్టీలు ఇపుడు జడుసుకుంటున్నాయి. అ డిమాండ్ తలకెత్తుకుని చంద్రబాబు ఎన్ని తలనొప్పులు భరించారో చూసిన తరువాత మరో పార్టీ ఆ విషయం టచ్ చేసేందుకే భయపడే పరిస్థితి. ఇక ముద్రగడ కూడా అధికార పక్షం పై నిప్పులు చెరగడం వరకూ బాగానే ఉన్నా ప్రతిపక్ష వైసీపీనైనా  చేరదీయాల్సింది, కనీసం . వారితో సఖ్యత గా ఉండాల్సింది. రేపు అధికారంలోకి వస్తారనుకుంటున్న పార్టీ తో గొడవ పెట్టుకుని రచ్చ చేసుకున్నారు. ఫలితంగా వైసీపీ కాపుల విషయంలో బాగా వెనక్కు తగ్గింది.


జనసేన వల్ల అవుతుందా :


పవన్ స్వతహాగా ఆ కులం నాయకుడు. ఆయన కనుక కాపుల రిజర్వేషన్ పై హామీ ఇస్తే మిగిలిన కులాలు దూరం అవుతాయి. వెనకటికి చిరంజీవి కూడా కాపు ముద్రతో ప్రజారాజ్యం పార్టీని పరాజయం బాట పట్టించారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ ఆ రిస్క్ చేయలేరు. దాంతో ఏపీలోని మూడు ప్రధాన పార్టీలు కాపుల రిజర్వేషన్ అంశాన్ని పక్కన పడేసినట్లవుతొంది. 
దీనిపై కాపులలో అంతర్మధనం మొదలైంది. ముద్రగడ సైతం ఏం చేయలో పాలుపోని స్థితిలో పడ్డారు. ఆయన స్వరంలో వెనకటి చురుకు కనిపించడం లేదు. మా జాతికి ఎవరు అండగా ఉంటే వారితోనే ఉంటామని చెప్పడం   మినహా ఏం చేయ‌లేకపోతున్నారు. ఓ విధంగా ఇపుడు కాపుల డిమాండ్ ఏపీ రాజకీయాల ప్రధాన అజెండా నుంచి  సైడ్ అయిందనే చెప్పుకోవాలి. ఇందుకు ఉద్యమ నేతలే బాధ్యత వహించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: