తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆస్తుల వివరాలు ప్రతీ ఏటా ప్రకటిస్తున్నారు. అంతవరకూ మంచి సంప్రదాయం అనుకున్నా ఆ ఆస్తుల ప్రకటన చూసిన వారికి మాత్రం ఎప్పటికీ ఊహకు అందని లాజిక్కులు మాత్రం ఎన్నో కనిపిస్తున్నాయి. బాబు వరకూ చూసుకుంటే నలభయ్యేళ్ళ రాజకీయ అనుభవం కలిగిన వారు, మంత్రిగా పలు మార్లు, ముఖ్యమంత్రిగా పలు మార్లు చేసిన అనుభవం ఉన్న వారు. మరి ఆయన అస్తులేమో ఎపుడూ తక్కువగానే కనిపిస్తున్నాయి.


రెండు దగ్గరే ఆగుతోందిగా:


చంద్రబాబుకు రెండంకెకూ అవినాభావ సంబంధం ఏదో ఉంది. రెండు ఎకరాల ఆసామిగా ఆయన రాజకీయాల్లో ప్రవేశించినపుడు చెప్పుకున్నారు. ఇపుడు మాత్రం కేవలం రెండు కోట్ల అసామి గా మాత్రమే జనం ముందుకు వస్తున్నారు. పైగా చేతికి బంగారు ఉంగరం ఉండదు, వాచీ అంతకంటే ఉండదు, తన పేరు మీద సొంత ఇళ్ళు కూడా ఉండదు, అపుడెపుడో త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ ని చూశాం, మళ్ళీ ఇపుడు చంద్రబాబునే మెచ్చుకోవాలేమో.


మనవడే ఘనుడు :


చెప్పాలంటే ఈ విషయంలో డెబ్బ‌యేళ్ళ చంద్రబాబు కంటే మూడేళ్ళ మనవడు దేవాన్ష్ చాలా బెటర్ గా ఉన్నారు. ఆయన ఆస్తి అక్షరాలా 18 కోట్ల రూపాయలు, ఈ వయసులో ఏం సంపాధించారో కానీ అతని ఖాతాలో అంత మొత్తం చూపించడం విశేషమే మరి. ఇక భార్య భువనేస్వరి ఆస్తులు చాలా నయం ఆమె ఏకంగా 31 కోట్లకు పైగా అస్తిపరురాలు, కుమారుడు లోకేష్ 21 కోట్లకు అధిపతి, కోడలు నారా బ్రాహ్మణి ఆస్తులు చూస్తే ఏడున్నర  కోట్లను దాటాయి. అంటే ఆ ఇంటికి అధిపతి, ఏపీకి కూడా పతి అయిన చంద్రబాబు ఆస్తులు  మాత్రం అచ్చంగా 2.9 కోట్లు, అంతటితో  ఆగిందా అంటే లేదు అప్పులు మాత్రం బాబు గారికి ఆస్తులను మించే ఉన్నాయి. అవి 5.32 కోట్లు వుండడం బట్టి చూస్తే మన బాబు గారు ఆ రెండెకరాల దగ్గరే ఆగిపోయారనిపిస్తోంది. 


ఏంటి లాభం :


ఇలా అస్తుల ప్రకటన చేయడం వల్ల లాభం ఏమైనా ఉందా అంటే లేదనే చెప్పుకోవాలి. బాబు ఆస్తులు చెప్పినా చెప్పకపోయినా దేశంలోని అత్యంత ధనవంతులైన సీఎంలలో ఆయన అగ్ర భాగాన ఉన్నారని  అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌(ఏడీఆర్‌) ఈ ఏడాది ఫిబ్రవరిలో వెల్లడించింది. ఆయన ఆస్తులు రూ. 177 కోట్లుగా ఏడీఆర్‌ పేర్కొంది. చంద్రబాబు వ్యక్తిగత ఆస్తులు కేవలం రూ. 34 లక్షలు మాత్రమేనని ఆయన కుమారుడు నారా లోకేశ్‌ గతంలో ప్రకటించారు. మరి ఇంతలోనే బాబు ఆస్తులు 2.9 కోట్లకు పెరిగాయి. ఇది నమ్మాలా. అది నమ్మాలా మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: