తెలంగాణా రాష్ట్ర సమితి అభ్యర్ధులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాల పరిస్ధితిని పక్కకు పెట్టినా గ్రేటర్ పరిధిలోని అభ్యర్ధుల్లో మాత్రం టెన్షన్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇంతకీ టెన్షన్ ఎందుకంటే, గ్రేటర్ పరిధిలోని 22 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల్లో కార్పొరేటర్లలలో చాలామంది సహకరించటం లేదట. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో 99 డివిజన్లలో టిఆర్ఎస్ కార్పొరేటర్లే ఉన్నారు. కొంతమంది కార్పొరేటర్లు మాత్రం తమ నియోజకవర్గాల్లోని ఎంఎల్ఏ అభ్యర్ధులతో కలిసి నడుస్తుండగా చాలామంది కార్పొరేటర్లు మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. దాంతో వాళ్ళ మనస్సుల్లో ఏముందో ఎవరికీ అర్ధం కావటం లేదు.

 

ఈమధ్య గ్రేటర్ పరిధిలోని అభ్యర్ధులతో కెసియార్ కొడుకు, మంత్రి, గ్రేటర్ ఇన్చార్జి కెటియార్ సమావేశమయ్యారు. ఆ సమావేశంలో పాల్గొన్న అభ్యర్ధులందరూ భోరుమన్నారట. కార్పొరేటర్లు చాలామంది సహకరించటం లేదని ఫిర్యాదు చేశారని సమాచారం. తాము ప్రచారం మొదులుపెట్టి చాలా రోజులే అవుతున్నా ఇంత వరకూ చాలామంది కార్పొరేటర్లు కనిపించలేదని ఫిర్యాదు చేశారట. ప్రచారంలో తమతో కలిసి రాకపోవటంతో పాటు ప్రత్యర్ధి పార్టీల అభ్యర్ధులకు సహకరిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పుకున్నారట. దాంతో కెటియార్ కూడా కలసిరాని కార్పొరేటర్లను ఎలా దారికి తెచ్చుకోవాలో ఆలోచిస్తున్నారు. కార్పొరేటర్లను బుజ్జగించి దారికి తెచ్చే బాధ్యతను ముందుగా మేయర్ బొంతు రామ్మోహన్ కు అప్పగించారు. మరి బొంతు మాట ఎంత వరకూ చెల్లుబాటవుతుందో చూడాలి.

 

పోలింగుకు ఉన్నది 15 రోజులు మాత్రమే. ఒకవైపేమో మహాకూటమిలో తారస్ధాయికి చేరుకున్న టిక్కెట్ల లొల్లి సర్దుబాటవుతున్నది. రాజేంద్రనగర్, కుకట్ పల్లి, ఖైరతాబాద్, ఎల్బీ నగర్ తదితర నియోజకవర్గాల్లో మొదలైన గొడవలు సర్దుబాటైనట్లే కనిపిస్తోంది. ఎందుకంటే, మహాకూటమిలోని పార్టీల నేతలు, అభ్యర్ధులు, అసంతృప్త నేతలు అంతా కలిసి రెండు రోజులుగా ప్రచారం చేస్తున్నారు. దాంతో వారి మధ్య విభేదాలు సద్దుమణిగాయనే అనుకుంటున్నారు.  టిఆర్ఎస్ అభ్యర్ధుల్లో టెన్షన్ పెరిగిపోవటానికి ప్రత్యర్ధి పార్టీల్లోని అసంతృప్తులు సద్దుమణగటం కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

 

అందుకనే తమ అభ్యర్ధులకు సహకరిస్తున్న నేతలు, కార్పొరేటర్లు ఎవరు, ప్రత్యర్ధులకు మద్దతు పలుకుతున్న వారెవరు అన్న విషయంలో పార్టీ పరంగా సమాచారం సేకరిస్తున్నారు కెటియార్. ఒకవైపు పార్టీ పరంగా సమాచారం అందుకుంటూనే మరోవైపు నిఘా విభాగం నుండి కూడా రోజువారి నివేదికలు తెప్పించుకుంటున్నారు. అసంతృప్తులను గుర్తించి ఎలాగైనా దారికి తెచ్చుకోవాలన్నది కెటియార్ వ్యూహం. కానీ అది అంత సులభంగా అయ్యేట్లు కనబడటం లేదు.

 

ఎలాగంటే, కెపిహెచ్బి కార్పొరేటర్ పన్నాల కావ్యారెడ్డి భర్త హరీష్ కూడా టిక్కెట్టు కోసం ప్రయత్నించారు. టిఆర్ఎస్ టిక్కెట్టు దక్కకపోవటంతో వెంటనే పార్టీకి రాజీనామా చేసేసి బిఎస్పీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. అంటే కెపిహెచ్ బి కార్పొరేటరే తమకు ప్రత్యర్ధి అవ్వటంతో ఆ డివిజన్ లోని ఓట్లు ఎన్ని పడతాయో తెలీటం లేదు. అలాగే మైలార్ దేవ్ పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ కూ టిక్కెట్టు దక్కలేదు. దాంతో ఆయన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. గురువారం నుండి 29వ తేదీ వరకూ కెటియార్ గ్రేటర్ పరిధిలో రోడ్డుషోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయానికి నియోజకవర్గాల పరిధిలోని కార్పొరేటర్లందరూ పాల్గొనేలా చేయాలన్నది కెటియార్ లక్ష్యం. కానీ అదంతా సులభమనిపించేలా లేదు చూస్తుంటే. పోయిన ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో టిఆర్ఎస్ కు మూడే సీట్లొచ్చాయి. మరి ఇపుడు ఎన్ని సీట్లొస్తాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: