ఏపీ రాజకీయాల్లో ఈ పదం చాలా ఎక్కువగా వినిపిస్తోంది. నాపై కుట్ర చేస్తున్నారు అంటూ రాజకీయ పార్టీల అధినేతలు నెత్తీ నోరూ బాదుకుంటున్నారు. నిజానికి కుట్ర అన్న పదం చాల పెద్దది. నియంత పాలనలోనో, రాచరిక వ్యవస్థలోనో ఉన్నపుడు ఈ పదానికి ఎంతో విలువ ఉంది. మనం ఉన్నది ప్రజాస్వామ్యంలో ఏది జరిగినా ఎంతో కొంతమంది జనం ఆమోదం ఉండి తీరాలి. మరి దాన్ని కుట్ర అని ఎలా అన‌గలరు.


అన్ని పార్టీలదీ అదే  కుట్ర :


నిజానికి ఏపీ జనాలకు ఈ మధ్య కాలంలో ఈ పదాన్ని పరిచయం చేసి ఎక్కువగా పాపులారిటీ తీసుకొచ్చిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుకు దక్కుతుంది. కేంద్రం  నాపైన కుట్ర పన్నుతొందని మొదలుపెట్టిన చంద్రబాబు, తరువాత దాన్ని మరింతగా విస్తరించి ఏపీలో ఉన్న ప్రతిపక్షాలు వైసీపీ, జనసేనలకు జోడించారు. అంతటితో ఆగకుండా పక్కన ఉన్న టీయారెస్ ని కూడా కలిపేశారు. ఇప్పటికైతే నాలుగు పార్టీలు అని చంద్రబాబు అంటూంటే ఆ నలుగుగు అని టైటిల్స్ పెట్టి అనుకూల మీడియా  అదే పనిగా జనం మెదళ్ళలోకి ఎక్కిస్తోంది.


నిజానికి కుట్ర ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు. పైగా చంద్రబాబు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి. ఆయనే కోరి బీజేపీతో పొత్తు పెట్టుకుని నాలుగేళ్ళు కాపురం చేశారు. ఇపుడు విడిపోయిన తరువాత కుట్ర అంటున్నారు. ఇదే మాట అప్పట్లో కుట్ర చేశారని కాంగ్రెస్ ని కూడా అన్నారు. ఇపుడు ఆ పార్టీతో కలుస్తున్నారు. అంటే బాబు భాషలో చూసుకుంటే తనకు ప్రత్యర్ధి అయిన పార్టీలు ఏంచేసినా , మాట్లాడినా కుట్ర అని అంటారన్న మాట. ఇదే అర్ధం చేసుకోవాలేమో.


నాపైన కుట్ర బాబు పనే:


ఇక ఏపీలో ప్రధాన ప్రతిపక్ష‌ నాయకుడు జగన్ ఉన్నారు. ఆయన పైన విశాఖ విమానాశ్రయంలో హత్యా యత్నం జరిగింది. దాన్ని తనపైన బాబు చేసిన కుట్రగా జగన్ తేల్చేశారు. అంటే ముఖ్యమంత్రి ఉన్నది ప్రతిపక్ష నాయకున్ని కుట్ర చేసి అంతం చేయడానికేనా. బాబుకు వేరే పని లేదా. ఆయన ప్రజలకు ముఖ్యమంత్రా, లేక కుట్రలు పన్నే వారా. సహజంగా ఈ ప్రశ్నలు జనాల్లో వస్తున్నా వైసీపీ నాయకులు మాత్రం పదే పదే కుట్ర ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ వ్యవహారం కోర్టులో ఉంది. నిజాలు నిగ్గు తేలాల్సి కూడా ఉంది.


నన్ను చంపాలని  కుట్ర :


ఈ మాట అంటున్నది మరో ప్రతిపక్ష నాయకుడు  పవన్. తనను, తన పార్టీ వారిని ఇసుక లారీలు పెట్టి తొక్కించి  మరీ చంపాలను చూస్తున్నారని జనసేనాని ఆరోపిస్తున్నారు. మండపేట మీటింగులో పనిగట్టుకుని మరీ పవన్ ఇదే చెప్పుకుపోయారు. పవన్ ని ఎందుకు చంపుతారు, ఆ అవసరం ఎందుకు ఉంటుంది. ఆయన వల్ల ఎవరికి ఇబ్బంది ఉంది. తన మానాన తాను పార్టీ పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారు కదా. ఇదీ ఏపీ జనం మనోభావాలు. కానీ పవన్ మాత్రం పదే పదే కుట్రలు చేస్తున్నారని కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.


లాజిక్ ఉందా :


నిజానికి మనది ప్రజాస్వామ్యం, నచ్చిన వారిని జనం ఎన్నుకుంటారు. నచ్చని వారిని పక్కన పెడతారు. జనం మెప్పు పొందాల్సిన వారు అందుకోసం కష్టపడి పనిచేయాలి. పాటుపడాలి, అంతే తప్ప కుట్ర, కుతంత్రం అంటూ లేని పోని సానుభూతి కోసం ప్రయత్నం చేయడం అంటే రాంగ్ రూట్లొకి  పోతున్నట్లే. చంద్రబాబు అయినా, జగన్ అయినా, పవన్ అయినా కుట్రలు ఎవరూ చేయరని తెలుసుకోవాలి. రేపు జనం వేరే పార్టీని ఎన్నుకుని నచ్చని వారికి దింపేసినా కూడా జనం కుట్ర చేశారని అంటారా. ప్రజాస్వామ్యంలో ఉంటున్న నేతలు పరిణతిలో ఉండాలి. ప్రజాస్వామ్య భాష వాడాలి. అంతే కానీ దిగజారుడు రాజకీయం చేస్తే జనం మెచ్చరు.


మరింత సమాచారం తెలుసుకోండి: