తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతల్లో మాటల యుద్దం మొదలైంది.  మొన్నటి వరకు ఎవరు ఏ పార్టీలో ఉంటారు అర్థం కాని పరిస్థితి నెలకొంది.  అయితే టీఆర్ఎస్ లో తాము ఆశించిన టిక్కెట్టు రాని వారు కాంగ్రెస్, బీజేపీలను ఆశ్రయించగా..కాంగ్రెస్ రెబల్స్ టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు.  ప్రస్తుతం అన్ని పార్టీ నాయకులు ప్రచారాల్లో మునిగిపోయారు.  తాజాగా టీఆర్ఎస్‌కు మరోసారి షాక్ తగిలింది.  ఓవైపు హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో మైనార్టీ సదస్సు జరుగుతుంటే...మరోవైపు ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

ఆ పార్టీ మైనార్టీ నేత, జిల్లా అధ్యక్షుడు బుడాన్ బేగ్ టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)లో సీనియర్ నేతలకు గౌరవం లేదని తిరుగుబాటు నేత, ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు బుడాన్ బేగ్ ఆరోపించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ కబంద హస్తాల్లోకి వెళ్లిపోయారని విమర్శించారు. కేటీఆర్ అపాయింట్ మెంట్ కోసం తాను 2 సంవత్సరాలు ఆగాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. మంత్రులను కలవని ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. త్వరలోనే తాను టీడీపీలో చేరబోతున్నానని ప్రకటించారు. టీఆర్ఎస్ నుంచి తప్పుకోవాలన్న నిర్ణయం సడెన్ గా తీసుకున్నది కాదని బుడాన్ బేగ్ తెలిపారు. అంతే కాదు ఖమ్మం జిల్లాలో పదికి 10 సీట్లు గెలిపించే సత్తా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఉందని టీఆర్ఎస్ తిరుగుబాటు నేత బుడాన్ బేగ్ తెలిపారు. 

ఫెడరల్ ఫ్రంట్ పెట్టి బీజేపీ, కాంగ్రెస్ లను ఎదుర్కొంటామని కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారన్నారు.  ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వబోమని అమిత్ షా తెలంగాణ గడ్డపై ప్రకటిస్తే ఆయన్ను విమర్శించే ధైర్యం కేసీఆర్ చేయలేదని ఎద్దేవా చేశారు.  టీఆర్ఎస్ నుంచి బయటకు వెళతామన్న వార్తల నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు తనను సంప్రదించారన్నారు.  ఖమ్మంలో ఈ నెల 28న జరిగే సభలో బుడాన్ బేగ్ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.  ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఒక సీటు దక్కితే గొప్ప విషయమని వ్యాఖ్యానించారు. కాగా, ఈ నెల 28న ఖమ్మంలో జరిగే మహాకూటమి సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో బేగ్ టీడీపీలో చేరతారని ఆయన సన్నిహితులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: