ప్రత్యేక హోదా అన్నది ఓ బ్రహ్మ పదార్ధం. అది ఎలా ఉంటుందో, ఎపుడు వస్తుందో కూడా చాలా మంది రాజకీయ నాయకులకు తెలియదు. అదేదో సినిమాలో పదం బాగుందని అర్ధం తెలియకుండా  వాడేస్తాడు ఓ కామెడియన్. ఇపుడు హోదా అంటే నాలుగు ఓట్లు పడతాయన్న ఆలోచనే తప్ప అది ఎలా సాధ్యమన్నది చెప్పకుండా మభ్యపెట్టేందుకు పార్టీలు రెడీ అయిపోతున్నాయి. మరి జనం ఓటేస్తారా


కాంగ్రెస్ దే పాపం:


కాంగ్రెస్ పార్టీ అడ్డ గోలుగా ఏపీని ముక్కలు చేసింది. దాని వల్ల ఏర్పడిన భూ మండలం అంత గాయానికి పూత పూస్తామంటూ కొన్ని చెల్లని హామీలు ఇచ్చేసింది. నిజంగా   కాంగ్రెస్ కి అప్పట్లోనే చిత్త శుద్ధి ఉంటే తాను అధికారంలో ఉండగానే హోదా ప్రకటించవచ్చు కదా. అది సాధ్యపడదని తెలుసు. పైగా మిత్రులు గుస్సా అవుతారని ఇంకా బాగా తెలుసు. అన్నీ తెలిసిన కాంగ్రెస్ వంచించే ఉద్దేశ్యంతోనే హోదా మాట ఎత్తుకుంది. కానీ చట్టం చేయలేదు. ఇదే కదా అసలైన మతలబు.

తరువాత వచ్చిన బీజేపీకి కూడా అది కష్ట సాధ్యమైనదని తెలుసు. కానీ చెప్పకుండా ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చేసింది. ఆ పార్టీతో నాలుగేళ్ళ పాటు అంటకాగిన చంద్రబాబుకు అప్పట్లో హోదా అన్నది సంజీవినిగా కనిపించలేదు. ఎన్నికలు దగ్గర్లొ ఉన్నాయనగానే చెప్పుకోవడానికి గట్టిగా తాను చేసిందేమీ లేదని, మళ్ళీ 2014 నాటి హోదా హామీతో జనంలోకి వస్తున్నారు. ఈసారి కండువా మార్చేసి కాంగ్రెస్ అంటున్నారు. ఓట్లు వేయడానికి జనం సిధ్ధంగా ఉండాలన్నమాట.


ఆ క్లారిటీ ఇస్తారా :


పొరపాటున రేపు కేంద్రంలో రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చారే అనుకుందాం. ఆయన సొంత మెజారిటీతో రారు కదా. వెనకాల కన్నడ కుమార స్వామి. తమిళ  తంబి స్టాలిన్, ఒడిషా పట్నాయక్. బెంగాల్ మమత. యూపీ అఖిలేష్ బాబు, మాయవతి జోడీ ఉంటారు. కదా. వీరందరి అనుమతి, అంగీకారం లేకుందా హోదా ఇస్తానంటే కుదురుతుందా. అసలు వాళ్ళు ఒప్పుకుంటారా.

నిజానికి హోదా ఇవ్వాలంటే ఏపీ కంటే ముందుగా బీహార్, ఒడిషా వంటి నాలుగైదు రాష్ట్రాలు క్యూలో ఉన్నాయి. హోదా ఇవ్వాలంటూ పెట్టిన కొన్ని నిబంధనలు వాటికి పూర్తిగా వర్తిస్తాయి కూడా. హోదా కోసం ఆయా రాష్ట్రాలు పెద్ద గొంతు పెట్టి డిమాండ్ చేస్తే రాహుల్ ఏమి చేయగలరు. ఇవేమీ చెప్పకుండా మభ్యపెట్టి ఓట్లు తీసుకుని ఆనక అధికారంలోకి వచ్చాక చేతులెత్తేయవచ్చునని రాజకీయ పార్టీల ప్లాన్ గా కనిపిస్తోందంటున్నారు. అందువల్ల ఈసారి ఆంధ్ర ఓటర్లు మళ్ళీ హోదా అంటే ఈసారి నమ్మి మోసపోవద్దని సొషల్ మీడియాలో ఓ వైపు జోరుగా  సూచనలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: