రోజంతా కసరత్తు చేసి మూలనున్న ముసలమ్మను కొట్టాడట వెనకటికెవడో. చంద్రబాబునాయుడు వ్యవహారం కూడా అలాగే ఉంది. ఎన్నికలు మొదలైనప్పటి నుండి చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని కెసియార్ రెచ్చిపోతున్న విషయం అందరూ చూస్తున్నదే. చంద్రబాబు కూడా ప్రచారానికి వస్తే కెసియార్ కథేంటో చెబుతారంటూ టిడిపి నేతలు నానా హడావుడి చేశారు. తీరా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు ప్రసంగం కాస్త తుస్సుమన్నది. మచ్చుకి కూడా కెసియార్ పై ఒక్కటంటే ఒక్క మాట కూడా గట్టిగా మాట్లాడలేకపోయారు. చంద్రబాబు ప్రసంగమంతా కెసియార్ ను బ్రతిమాలుకోవటం, తనను తిట్టదని వేడుకోవటం, కెసియార్ తనను తిట్టటం న్యాయమేనా తమ్ముళ్ళు మీరే చెప్పండని అడగటంతోనే సరిపోయింది.

 

తెలంగాణా ఎన్నికలు మొదలైనప్పటి నుండి ప్రచారం విషయంలో అదిగో చంద్రబాబు ఇదిగో చంద్రబాబు అంటూ తెలుగుదేశంపార్టీ నేతలు చాలా హడావుడే చేశారు. తెలంగాణాలో తాను ప్రచారమే చేయనని ఎప్పుడో చంద్రబాబు చెప్పారు. అయితే అందరి ఒత్తిడి మేరకు మొత్తానికి తెలంగాణాలో ప్రచారం చేయటానికి చంద్రబాబు అంగీకరించారు. బుధవారం ఖమ్మంలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు కూడా. ఏఐసిసి అధ్యక్షుడు రాహూల్ గాంధితో కలిసి వేదిక పంచుకున్నారు లేండి.

 

కెసియార్ మొదటినుండి చంద్రబాబునే టార్గెట్ చేసుకుంటున్నారు. కెతెలిసిపోతోంది. మహాకూటమి గెలిస్తే చంద్రబాబు పెత్తనమే మొదలవుతుందన్నారు. మహాకూటమిని గెలిపించి మళ్ళీ పరాయి పెత్తనాన్ని నెత్తిన పెట్టుకుందామా అంటూ జనాలను రెచ్చగొడుతున్నారు. సభ ఏదైనా చంద్రబాబే టార్గెట్. చంద్రబాబు మోసగాడని, ఓటుకునోటు కేసులో దొరికిన దొంగ అని రకరకాలు కార్నర్ చేసేస్తున్నారు.

 

కెసియార్ తిట్లకు చంద్రబాబు కూడా ధీటుగా రిప్లై ఇస్తారని కెసియార్ పనై పోయిందనే అనుకున్నారు.  ఖమ్మం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగం మొదలైన తర్వాత చూస్తే కెసియార్ అంటే చంద్రబాబు ఎంతలా భయపడుతున్నారో తెలిసిపోతోంది. మహాకూటమి గెలిస్తే తాను తెలంగాణా మీద ఆధిపత్యం చేయనని చెప్పుకున్నారు. తనకు తెలంగాణా అంటే ఎంత ప్రాణమైనా తాను మాత్రం ఎప్పటికీ ఏపిలోనే ఉంటానని హామీ ఇచ్చారు. తెలంగాణాలో తాను ఎప్పటికీ పోటీ చేయనుగాక చేయనన్నారు. తాను కెసియార్ గురించి మాట్లాడకపోయినా తనను కెసియార్ తిట్టటం ఏమన్నా న్యాయమా తమ్ముళ్ళూ అంటూ మరీ బేలగా అడగటం చూసిన తమ్ముళ్ళు తలలు పట్టుకున్నారు.

 

ప్రసంగం మొత్తం విన్న తర్వాత కెసియార్ కాళ్ళ బేరానికి చంద్రబాబు దిగిపోయినట్లుగా అనిపించింది. దీనికంతటికీ ప్రధాన కారణం ఓటుకునోటు కేసే అని చెప్పక్కర్లేదు. ఖమ్మంలో జరిగిన మొదటి మీటింగ్ లోనే చంద్రబాబు ప్రసంగం అంత పేలవంగా సాగితే ఇక మిగిలిన మీటింగుల సమావేశాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడే చంద్రబాబుకు కెసియార్ కు తేడా తెలిసిపోతోంది. ఏ విషయం చెప్పదలుచుకున్నా, తిట్ట దలుచుకున్నా కూడా కెసియార్ లో స్పష్టత కనబడుతోంది. అదే చంద్రబాబును తీసుకుంటే ప్రతిదీ డొంకతిరుగుడే. ఏమాటా స్పష్టంగా ఉండదు, సూటిగా చెప్పలేరు. చంద్రబాబులోని ఆ వీక్నెస్ నే కెసియార్ బాగా ఉపయోగించుకుంటున్నారు. ఖమ్మంలో చంద్రబాబు ప్రసంగం విన్న తర్వాత తెలంగాణాలో ప్రచారం చేయకుండా ఉంటేనే బాగుంటుందని తమ్ముళ్ళనుకుంటే అది వాళ్ళ తప్పు కాదు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: