తెలుగుదేశంపార్టీ అభ్యర్ధిగా మహాకూటమి తరపున పోటీ చేస్తున్న చుండ్రు అలియాస్ నందమూరి సుహాసిని గెలుపు అంత ఈజీ కాదని సమాచారం. తెలుగుదేశంపార్టీలో అంతర్గతంగా ఇపుడిదే చర్చ జరుగుతోంది. సుహాసిని గెలుపు సునాయాసమంటూ ఒకవైపు మహాకూటమి నేతలతో పాటు నారా భువనేశ్వరి బల్లగుద్ది మరీ చెబుతున్నారు. కానీ క్షేత్రస్ధాయిలో మాత్రం పరిస్ధితులు అంత ఆశాజనకంగా లేవని సమాచారం. ఒక విధంగా ప్రస్తుత పరిస్దితికి చంద్రబాబునాయుడే కారణమని అంటున్నారు. ఏపిలో చంద్రబాబు రగిల్చిన కులాల కుంపట్లు ఇఫుడు కుకట్ పల్లిలో ప్రభావం చూపనుందట.

 

తెలుగుదేశంపార్టీకి సేఫెస్ట్ నియోజకవర్గమని, నామినేషన్ వేస్తే చాలు అభ్యర్ధి ఎవరైనా సరే గెలిచిపోతారని అందరూ అంచనా వేశారు. అందుకే చివరినిముషంలో చంద్రబాబు దివంగత నేత నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినిని రంగంలోకి దింపారు. నిజానికి ఈ నియోజకవర్గంలో సీమాంధ్రుల ప్రాబల్యమే చాలా ఎక్కువ. ఈ నియోజకవర్గంలో సుమారు 3 లక్షల ఓటర్లున్నారు. కాపులు సుమారు 60 వేలు, బిసిలు 70 వేలు, రెడ్లు 20 వేలు, కమ్మోరు 13 వేలు, బ్రాహ్మణులు 11 వేలున్నారట. వీరు కాకుండా ఎస్సీలు, ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారట.


పై సామాజిక వర్గ ఓటర్లలో అత్యధికులు పోయిన ఎన్నికల్లో టిడిపికే ఓట్లేశారు. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం టిడిపికి ఓట్లు వేయటం డౌటేనని సమాచారం. ఎందుకంటే, చాలామంది చంద్రబాబుపై మండిపోతున్నారట. బిసి రిజర్వేషన్లలో కలుపుతామని కాపులకు హామీ ఇచ్చారు. కానీ కలపకుండా తమను దగా చేశాడని కాపులు మండిపోతున్నారట. అలాగే పోయిన ఎన్నికల్లో పవన్ కల్యాణ్ వల్లే మెజారిటీ కాపులు టిడిపికి ఓటేశారు. కానీ ఈసారి ఆ ముచ్చట లేదు.  ఇక సామాజికంగా గట్టి స్ధితిలో ఉన్న కాపులను బిసిల్లో కలుపుతానని హామీ ఇచ్చినందుకు బిసిలు కూడా మండుతున్నారట. వివిధ కారణాలతో ముస్లింలు, బ్రాహ్మణులు, ఎస్సీలు కూడా చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

 

నాలుగున్నరేళ్ళ  పాలనలో ఏపిలో తమను అన్నీ విధాల ఇబ్బందులకు గురిచేసిన తర్వాత కూడా కుకట్ పల్లిలో తాము తెలుగుదేశంపార్టీకి ఓట్లేస్తే ఏపిలో చంద్రబాబు పాలనకు మద్దతిచ్చినట్లవుతుందని పై సామాజికవర్గాలు భావిస్తున్నాయట. దానికితోడు సుహాసిని స్ధానికురాలు కూడా కాదు. అదే సమయంలో స్ధానికుడైన టిఆర్ఎస్ అభ్యర్ధి మాదవరం కృష్ణారావుకు ఓట్లేస్తే ఏదైనా అవసరమైతే వెళ్ళి అడగటానికైనా అవకాశం ఉంటుందని అనుకుంటున్నారట.

 

పైగా గడచిన నాలుగున్నరేళ్ళలో టిఆర్ఎస్ పాలనలో సీమాధ్రులకు వచ్చిన ఇబ్బందులు కూడా ఏమీ లేవు. అంతో ఇంతో కుకట్ పల్లిలో అభివృద్ధి కూడా చేశారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకూడదంటే టిఆర్ఎస్ కే ఓటెయ్యాలని సీమాంధ్రులు ఆలోచిస్తున్నారట. తమను మోసం చేశాడని చంద్రబాబుపైన కాపులు, ముస్లింలు, బ్రాహ్మణులు, ఎస్పీలు బాగా కోపంతో ఉన్నారు. మరి వారందరూ గనుక టిఆర్ఎస్ కే ఓట్లు వేస్తే సుహాసిని గెలుపు కష్టమే. మరి చూద్దాం ఓటర్లు ఏం చేస్తారో ?

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: