ఎన్నికల తేదీ దగ్గర పడేకొద్దీ అధికారంలోకి ఎవరొస్తారనే విషయంలో అయోమయం కూడా పెరిగిపోతోంది. ఒకవైపు తమదే అధికారమని కెసియార్ అంటున్నారు. కాదు తమదే  విజయమంటూ మహాకూటమి సవాలు చేస్తోంది. కెసియార్ ముందు 100 సీట్లలో గ్యారెంటీగా గెలుస్తామని చెప్పారు. కానీ ఆ తర్వాత ఆ విషయమే మాట్లాడలేదెక్కడా. ఎందుకంటే, టిక్కెట్ల విషయంలో టిఆర్ఎస్ లో పెరిగిపోయిన అంతర్గత గొడవలతో కారు జోరు బాగా తగ్గిపోయింది. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్ధులు ఇఫుడు కూడా ఎదురీదుతునే ఉన్నారు. మొన్న హఠాత్తుగా 100 కాదు 108 సీట్లొస్తాయని కెసియార్ చెప్పటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

 

అదే సమయంలో మహాకూటమికి నేతృత్వం వహిస్తున్న టిపిసిపి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ అధికారంలోకి రాబోయేది మహాకూటమే అంటూ సవాలు విసురుతున్నారు. మహాకూటమి అధికారంలోకి రాకపోతే తమ కుటుంబంలో ఎవరూ రాజీకీయాల్లో ఉండమంటూ ప్రతిజ్ఞ కూడా చేశారు. మరి ఉత్తమ్ నమ్మకమేంటో అర్ధం కావటం లేదు. సరే ఎవరి నమ్మకాలేంటో కాసేపు పక్కన పెడితే వాస్తవంగా అయితే రెండు పక్షాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసేంత పూర్తిస్దాయి మెజారిటీ వస్తుందా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

ఎందుకంటే, 119 నియోజకవర్గాలున్న తెలంగాణ అసెంబ్లీలో అధికారంలోకి రావాలంటే కనీసం ఎవరికైనా తక్కువలో తక్కువ 60 సీట్లు రావాలి. అయితే 60 సీట్లతో ఎవరు ప్రభుత్వాన్ని ఫాం చేయలేరు. ఎందుకంటే, ఆ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు. ఇక టిఆర్ఎస్ ఇప్పటి వరకూ సుమారుగా నాలుగు ఎన్నికలను ఎదుర్కొన్నది. ఒకసారి కాంగ్రెస్ తో కలిసి. తర్వాత టిడిపితో కలిసి.  ఒంటరిగా మొన్న 2014లో. అంతుకుముందు అప్పుడప్పుడు మధ్యంతర ఎన్నికల్లో కూడా పాల్గొంది. అయితే మూడు సాధారణ ఎన్నికల్లో పాల్గొన్న టిఆర్ఎస్ ఇప్పటి వరకూ వివిధ జిల్లాల్లోని 49 నియోజకవర్గాల్లో ఇఫ్పటి వరకూ ఒక్కసారి కూడా గెలిచింది లేదు.

 

ఉత్తర తెలంగాణా జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోనే టిఆర్ఎస్ బలంగా ఉంది. ఇక ధక్షిణ తెలంగాణా జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో బలహీనంగా ఉంది. దక్షిణ తెలంగాణా జిల్లాల్లో పాగా వేయాలని టిఆర్ఎస్ ఎంతగా ప్రయత్నించినా పెద్దగా సాధ్యం కావటంలేదు. మరి ఈ సారైనా దక్షిణ తెలంగాణాల్లో పాగా వేస్తుందో లేకపోతే ఉత్తర తెలంగాణా జిల్లాల్లో కూడా టిఆర్ఎస్ కు చిల్లు పడుతుందో చూడాలి.

 

ఇప్పటి వరకూ టిఆర్ఎస్ ఒక్కసారి కూడా గెలవని నియోజకవర్గాలేంటో ఒకసారి చూద్దాం. అంటే ఈ 49 సీట్లలోనే హైదరాబాద్ లోని మజ్లిస్ పోటీ చేస్తున్న 7 సీట్లు కూడా ఉన్నాయిలేండి.  ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, మెదక్ లోని జహీరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని కుత్బుల్లాపూర్, కుకట్ పల్లి, ఉప్పల్, ఇబ్రహింపట్నం, ఎల్బీ నగర్, చేవెళ్ళ, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, పరిగి ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలోని మలక్ పేట, అంబర్ పేట, జూబ్లిహిల్స్, సనత్ నగర్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్ పుర, బహదూర్ పుర, కంటోన్మెంట్ ఉన్నాయి.

 

మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్, నారాయణపేట, మక్తల్, వనపర్తి, గద్వాల, ఆలంపూర్, కల్వకుర్తి ఉన్నాయి. నల్గొండ జిల్లాలోని దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, నల్గొండ, వరంగల్ జిల్లాలోని పాలకుర్తి, డోర్నకల్ ఉన్నాయి. ఇక ఖమ్మం జిల్లాలోని పినపాక, ఇల్లెందు,, ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలున్నాయి. 119 నియోజకవర్గాల్లో 49 సీట్లలో గెలవకుండానే వచ్చే ఎన్నికల్లో 108 సీట్లు వస్తాయని కెసియార్ ఎలా చెబుతున్నారో అర్ధం కావటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: