చంద్రబాబానాయుడు మాటలు చాలా విచాత్రంగా ఉంటున్నాయి. రెగ్యులర్ గా వింటే కాస్త పిచ్చెక్కటం కూడా ఖాయమనే అనుకోవాలి. ఎందుకంటే తాను చేస్తే సంసారం ఎదుటివాళ్ళు చేస్తే వ్యభిచారం అనేది చంద్రబాబు సిద్ధాంతం. ఎందుకంటే, శేరిలింగంపల్లిలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఫిరాయింపు ఎంఎల్ఏని ఓడించాలని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణాలోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చంద్రబాబు మాటలు విన్న వాళ్ళకు మతులుపోయాయి. శేరిలింగంపల్లిలో జరిగిన రోడ్డుషోలో మాట్లాడుతూ, టిడిపి నుండి టిఆర్ఎస్ లోకి ఫిరాయించిన ఆరెకపూటి గాంధిపై మండిపడ్డారు.

 

టిడిపి తరపున టిక్కెట్టిచ్చి గెలిపించుకున్న తర్వాత టిఆర్ఎస్ లోకి ఎంఎల్ఏ ఫిరాయించటం ఎంత అన్యాయమో చెప్పండని జనాలను అడగటమే విచిత్రంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ తరపున పోటీచేస్తున్న ఫిరాయింపు ఎంఎల్ఏని చిత్తు చిత్తుగా ఓడించాలని కూడా పిలుపిచ్చేశారండోయ్. అంటే తెలంగాణాలో కెసియార్ ఫిరాయింపులకు పాల్పడితే చాలా ఘోరం. ఏపిలో చంద్రబాబు అదే ఫిరాయింపులకు పాల్పడటం మాత్రం పవిత్ర కార్యక్రమం. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష ఎంఎల్ఏలు వాళ్ళంతట వాళ్ళుగా వచ్చి టిడిపిలో చేరారట. వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఒంటెత్తు పోకడలు నచ్చకే వైసిపిలో నుండి 23 మంది ఎంఎల్ఏలు వచ్చేశారని చంద్రబాబు అండ్ కో చెబితే అందరూ నమ్మాలి.

 

ఏపిలో ఎంఎల్ఏల ఫిరాయింపులకు చంద్రబాబు అండ్ కో చెప్పే కారణాలు తెలంగాణలో వర్తించవు మళ్ళీ. తెలంగాణాలో ఎంఎల్ఏలు ఫిరాయించారంటే కెసియార్ ప్రలోభాలకు గురయ్యేనట. టిడిపి ఎంఎల్ఏలను కెసియార్ సంతలో పశువులను కొన్నట్లు కొన్నారట. టిడిపి ఎంఎల్ఏలను కెసియార్  పశువుల్లాగ కొన్నారో లేదో తెలీదు. కానీ ఏపిలో మాత్రం వైసిపి ఎంఎల్ఏలను చంద్రబాబు పశువుల్లాగే కొన్నట్లు అందరికీ తెలిసిపోయింది. ఎలాగంటే, మావోయిస్టుల చేతిలో విశాఖపట్నం అరకు ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావు హత్యకు గురైన విషయం గుర్తుంది కదా ?

 

తుపాకి దెబ్బకు కిడారి బలైపోయే ముందు మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించారు. ఆ ప్రజాకోర్టులో కిడారి మావోయిస్టులతో మాట్లాడుతూ, తనకు చంద్రబాబు రూ 12 కోట్లిచ్చినట్లు అంగీకరించారట. తనకు లాగే పాడేరు ఫిరాయించినందుకు ఎంఎల్ఏ గిడ్డి ఈశ్వరికి రూ. 20 కోట్లు ముట్టినట్లు కిడారి చెప్పారట. ఇక కర్నూలు జిల్లా కోడుమూరు ఎంఎల్ఏ మణిగాంధి ఒక సందర్భంలో మాట్లాడుతూ తనకు చంద్రబాబు రూ 6 కోట్లిచ్చినట్లు ప్రకటించారు. తనలాగ ప్రతీ ఫిరాయింపు ఎంఎల్ఏకి కోట్ల రూపాయలు ముట్టినట్లు కూడా చెప్పారు. అనంతపురంలో కదిరి ఫిరాయింపు ఎంఎల్ఏ అత్తార్ చాంద్ భాషకు తమ పార్టీ రూ 8 కోట్లిచ్చినట్లు స్వయంగా టిడిపి నేతలే చెప్పటం అప్పట్లో దుమారం రేగింది. అది ఏపిలో చంద్రబాబు, ఫిరాయింపుల కథ.

 

చంద్రబాబు చెప్పినట్లుగా నిజంగానే శేరిలింగంపల్లి ఫిరాయింపు ఎంఎల్ఏకి ఓట్లేయకూడదంటే అదే సూత్రం ఏపిలోని 23 మంది ఎంఎల్ఏకీ వర్తిస్తుంది. అంటే చంద్రబాబు పరోక్షంగా చెప్పటమేమిటంటే ఏపిలోని 23 మంది ఫిరాయింపు ఎంఎల్ఏలకు కూడా ఓట్లేయొద్దని. ఒకవేళ తాను గనుక టిక్కెట్టిచ్చి పోటీ చేసినా వాళ్ళకు ఓట్లు వేయొద్దని చెప్పటమే కదా ? అంటే అప్పట్లో అవసరానికి వాళ్ళని ప్రలోభాలకు గురిచేసి అవసరం తీరిన తర్వాత వాళ్ళని బయటపడేయటమే చంద్రబాబు వ్యూహంగా అర్ధమవుతోంది. పాపం ఫిరాయింపు ఎంఎల్ఏలు.


మరింత సమాచారం తెలుసుకోండి: