జనసేనలో కుమ్ములాటలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా పార్టీ అధికార ప్రతినిధి విజయబాబు పార్టీకి రాజీనామా చేయటం కలకలం రేపుతోంది. కాపు సామాజికవర్గానికే చెందిన విజయబాబు మెగాస్టార్ చిరంజీవితో సన్నిహిత సంబంధాలున్నాయి. కాబట్టి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కూడా బాగానే పరిచయం ఉంది. ఎలాగూ విజయబాబుకు సినిమా వాసనలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అందుకనే మొన్నటి జూలైలో జనసేనలో చేరారు. పార్టీలో చేరటమే ఆయన్ను అధికార ప్రతినిధిగా పవన్ నియమించారు. అయితే, విజయబాబు హఠాత్తుగా పార్టీకి రాజీనామా చేయటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

 

నిజానికి జనసేనలో పవన్ కోటరీగా ప్రచారంలో ఉన్న కీలక వ్యక్తుల మధ్య చాలా కాలంగా గొడవలు నడుస్తున్నాయి. పవన్ కు ఎవరు సన్నిహితులనే విషయంలో ఎవరికి వారుగా ఒకరిపై మరొకరు పై చేయి సాధించటంలో భాగంగా గొడవలు పడుతు పార్టీ పరువును బజారున పడేస్తున్నారు. ఆ విషయం పవన్ కు కూడా బాగా తలనొప్పులుగానే ఉన్నాయి. అందుకే తాడేపల్లిగూడెం బహిరంగసభలో గొడవల విషయంపై పవన్ బహిరంగ సభలోనే అసంతృప్తి వ్యక్తం చేయటం అందరికీ గుర్తుండే ఉంటుంది.

 

ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో జనసేనలో గ్రూపుల గొడవలు పెరిగిపోతుండటం పవన్ ను కూడా కలవర పరుస్తోందని సమాచారం. ఆ గ్రూపుల గోలతోనే విజయబాబు రాజానామా చేశారని పార్టీ వర్గాలు చెప్పాయి. కొత్త నేతలు చేరటం పాత కోటరికి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే, కోటరిలో ఉన్న వాళ్ళెవరికీ నేరుగా జనాలతో ఏమాత్రం సంబంధం లేదు. కానీ ఈమధ్యనే నాదెండ్ల మనోహర్, కొత్తగా చేరిన రావెల కిషోర్ బాబులు పూర్తిస్ధాయి రాజకీయ నేతలు. దాంతో మనోహర్ ను ఎలా బయటకు పంపాలా అని కోటరి ప్లాన్ లో ఉందని సమాచారం. కాకపోతే పవన్ కూడా మనోహర్ కు బాగా ప్రాధాన్యత ఇస్తుండటంతో అంత తేలిక కాదని అర్ధమవుతోంది. దానికితోడు రావెల కూడా పార్టీలో చేరటం కోటరీకి బాగా కారం రాసినట్లుంది.

 

జనసేనలో మొదటి నుండి ఉన్న తోట చంద్రశేఖర్, మాదాసు గంగాధరం లాంటి వాళ్ళ వాయిస్ ఎక్కడా వినబడటం లేదు. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ మరింతమంది కొత్త నేతలు జనసేనలో చేరబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త నేతలు చేరేకొద్దీ పాత వాళ్ళు వెళ్ళిపోతున్నారన్నమాట. అంటే కొత్త నీరొచ్చి పాత నీటిని బయటకు పంపేసినట్లు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం తోట చంద్రశేఖర్, మాదాసు లాంటి వాళ్ళు జనసేనకు రాజీనామా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదట. అదే జరిగితే పార్టీలో కుమ్ములాటలు రోడ్డున పడటానికి మరెంతో దూరం లేదన్న విషయం అర్ధమవుతోంది.

 

ఒకవైపేమో పార్టీని పటిష్టం చేయాలని, వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయిపోవాలని పవన్ కలలు కంటున్నారు. సిఎం ఎలా అయిపోతారన్న విషయం పవన్ కే తెలియాలి. గ్రౌండ్ రియాల్టి ప్రకారం జనసేనకు మహా వస్తే ఏ 10 సీట్లొస్తే చాలా ఎక్కువ. కానీ పవన్ లక్ష్యం మాత్రం ముఖ్యమంత్రి కుర్చీ మీదే ఉంది. వచ్చే ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి అయిపోతున్నట్లు పవనే స్వయంగా చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోయారు లేండి. సరే వచ్చే ఎన్నికల్లో పవన్ ఏమవుతారన్నది ఇపుడనవసరం. పార్టీలో గ్రూపుల గోల పెరిగిపోతున్నాయన్నది మాత్రం వాస్తవం. గ్రూపుల గోల నుండి పవన్ ఎలా బయటపడతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: