అవును అలాగే అనిపిస్తోంది. ఎందుకంటే, ఆ విషయం చెప్పింది జగన్మోహన్ రెడ్డి మీడియానో లేకపోతే వైసిపి పార్టీనో కాదు. సాక్ష్యాత్తు చంద్రబాబునాయుడుకు అండగా నిలబడే మీడియానే చెప్పింది. దాంతో తెలుగుదేశంపార్టీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే, కడప జిల్లాలో టిడిపి పరిస్ధితిపై చంద్రబాబు మీడియా ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ఇచ్చింది. అంటే మొత్తం 10 నియోజకవర్గాల్లోను పార్టీ పరిస్దితిపై సర్వే కూడా చేశారని సమాచారం. కాకపోతే సర్వే వివరాలేమో చంద్రబాబుకు నేరుగా అందించారట. వివరాలను మాత్రం కథనం రూపంలో ప్రచురించారు.

 

సదరు మీడియాలో ప్రచురితమైన కథనం ప్రకారమే జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల్లోను టిడిపి నేతల మధ్య విభేదాలు తీవ్రస్ధాయికి చేరుకున్నాయట. పోయిన ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గంలో మాత్రమే టిడిపి అభ్యర్ధి మేడా మల్లికార్జునరెడ్డి గెలిచారు. మిగిలిన నియోజకవర్గాలన్నీ వైసిపి ఖతాలోనే పడ్డాయి. తాజాగా వచ్చిన కథనం ప్రకారం చూస్తే రేపటి ఎన్నికల్లో మొన్న వచ్చిన రాజంపేట అయినా మళ్ళీ దక్కుతుందా అన్నది డౌటుగానే ఉంది. అంటే మొత్తం 10కి 10 సీట్లు వైసిపినే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

రాజంపేటలో మేడాకు వ్యతిరేకంగా ఒకవైపు పసుపులేటి బ్రహ్మయ్య మరో వైపు పత్తిపాటి కుసుమకుమారి వాయించేస్తున్నారు. ఇద్దరు ప్రత్యర్ధులతో ఏకకాలంలో పోరాడలేక మేడా నానా అవస్తలు పడుతున్నారట. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మేడాకే టిక్కెట్టిస్తే పార్టీ గెలవదని వాళ్ళిద్దరూ మంత్రులతో మేడా ఎదుటే కుండబద్దలు కొట్టినట్లు చెప్పటం గమనార్హం. ఇక, ప్రొద్దుటూరు సంగతి చెప్పనే అక్కర్లేదు. మాజీ ఎంఎల్ఏ, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ మధ్య పచ్చగడ్డి వేయకపోయినా మండిపోతోంది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నాలుగైదు గ్రపులుగా చీలిపోయింది టిడిపి. అదే సమయంలో వైసిపి ఎంఎల్ఏ రాచమల్లు ప్రసాద్ రెడ్డి బలమైన ప్రత్యర్ధి అన్న విషయంచెప్పక్కర్లేదు.

 

జమ్మలమడుగు సంగతి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నట్లుంది పరిస్ధితి. వైసిపి తరపున గెలిచిన ఆదినారాయణరెడ్డి టిడిపిలోకి ఫిరాయించి మంత్రి అయితే అయ్యాడు కానీ అప్పటి నుండి నియోజకవర్గంలో పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. ఆయన అరాచకాలను సహించలేకే చాలా గ్రామాల్లోని కుటుంబాలు వైసిపిలో చేరిపోయాయి. ఇక,  రాయచోటి, కడప, కమలాపురం, కోడూరు, మైదుకూరు, బద్వేలులో పూర్తిగా గ్రూపుల గోల ఎక్కువైపోయిందట. ఒక్క పులివెందులలో మాత్రమే గ్రూపుల గోల పెద్దగా లేదట.

 

ఆంధ్రజ్యోతిలో అన్నీ నియోజకవర్గాల గురించి డీటైల్డ్ గా ఇవ్వలేదు కానీ కథనం సారాంసం మాత్రం అదే. కథనం చదివిన తర్వాత తమ్ముళ్ళల్లో టెన్షన్ బాగా పెరిగిపోయిందట. అంటే చంద్రబాబు నాలుగున్నరేళ్ళ పాలనలో జనాల్లో ఏ స్ధాయిలో వ్యతిరేకత ప్రబలిపోయిందో అర్ధమైపోతోంది. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో కూడా టిడిపినే గెలుస్తుందని ఒకవైపు చంద్రబాబు గొంతు చించుకుంటున్నారు. మరో వైపేమో చంద్రబాబు మీడియాలో వచ్చిన కథనం పూర్తి వ్యతిరేకంగా ఉండటం గమనార్హం.   


మరింత సమాచారం తెలుసుకోండి: