ఎప్పుడూ షూటింగులతోను, రాజకీయాలతోను బిజీగా ఉండే సినీ, రాజకీయ ప్రముఖులు తెల్లవారే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీళ్ళంతా పోలింగ్ ప్రారంభమైన మొదటి గంటలోనే ఓటు వేసేందుకు క్యూలో నిలబడటం గమనార్హం. జూబ్లిహిల్స్ లోని పోలింగ్ కేంద్రంలో తమ ఓట్లు వేసేందుకు మెగాస్టార్ చిరంజీవి దంపతులు, అల్లు అర్జున్, అక్కినేని నాగార్జున, అమల దంపతులు, ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి దంపతులు, షటిల్ బాడ్మింటన్ స్టార్ పివి సింధు తదితరులు ఓట్లేశారు. అలాగే, సిద్దిపేటలో పోటీ చేస్తున్న టిఆర్ఎస్ అభ్యర్ధి హరీష్ రావు దంపుతులు కూడా ఉదయమే వచ్చి క్యూలో నిలబడ్డారు.

 

వీరు కాకుండా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్న, జిహెచ్ఎంసి కమీషనర్ దానకిషోర్,   ప్రశాసన్ నగర్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి, ఎంపి వినోద్ కుమార్, రమేష్ రాథోడ్, గుత్తా సుఖేందర్ రెడ్డి, సిటీ కమీషనర్ మహేష్ భగవత్, కాచిగూడలో అంబర్ పేట బిజెపి అభ్యర్ధి కిషన్ రెడ్డి తదితరులు ఓట్లు వేశారు. ఓట్లేసిన ప్రముఖులందరూ కూడా ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ అప్పీల్ చేశారు. తెలంగాణాలోని చాలా చోట్ల ఈవిఎంలు మొరాయించాయి. అదేవిధంగా ఓటర్లకు సాయం చేసేందుకు స్లిప్పులిచ్చే పార్టీల శ్రేణులు చాలా చోట్ల కనబడలేదు. దాంతో ఓట్లు వేయటంలో పోలింగ్ బూతులు కనుక్కోవటం ఇబ్బందిగా మారింది. ఎందుకంటే, ఓటర్లలో చాలామందికి ఎన్నికల సంఘం ఓటరుస్లిప్పులు అందిచలేదు. దాంతో అయోమయం చోటు చేసుకుంది.

 

మొత్తం మీద ఓట్లు వేసేందుకు ఓటర్లు ఉదయం మొదటి గంట నుండే పోలింగ్ బూతుల వద్ద బారులు తీరటం ఆశ్చర్యంగా ఉంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో నమోదైన వివరాల ప్రకారం హైదరాబాద్ లో 13 శాతం, కరీంనగర్ లో 13, నిజామాబాద్ లో 12, మెదక్ లో 14,  వరంగల్ లో 15, నల్లగొండలో 15, మహబూబ్ నగర్ లో 12, ఆదిలాబాద్ లో 12, రంగారెడ్డిలో 14, ఖమ్మంలో 13 శాతం ఓట్లు నమోదయ్యాయి. ఓటింగ్ ట్రెండును బట్టి మధ్యాహ్నం 12 గంటలకు చాలా చోట్ల సుమారు 40 శాతం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొన్ని చోట్ల పార్టీల ఏజెంట్లు ఆలస్యంగా రావటం, వీవీ ప్యాట్, ఈవిఎంల్లో సమస్యల వల్ల ఓటింగ్ ప్రక్రియకు బాగా జాప్యం జరుగుతోంది. ఆదిలాబాద్, అసిఫాబాద్, కొత్తగూడెం, హైదరాబాద్, కొత్తగూడెం, హయత్ నగర్, వివేకానందనగర్ తదితర పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు పడిగాపులు కాస్తున్నారు.

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: