మొత్తానికి తెలంగాణా ఎన్నికలు జరిగిపోయాయి. ప్రజా తీర్పు ఎదుర్కొని అంతా పునీతులైపోయారు ఎవరెన్ని అనుకున్నా జనం చెప్పెదే ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు కాబట్టి దానికి ఎవరైన తలొగ్గాల్సిందే మరి. ఇక అవినీతి ఆరోపణలు, గోడ దూకుళ్ళు అన్నీ కూడా ఒక్క ఓటు దెబ్బతో పటాపంచలు అయిపోయాయి. ఓ విధంగా పులి  కడిగిన ముత్యాలు ఇపుడు తెలంగాణా కొత్త ఎమ్మెల్యేలు.


ఫిరాయింపులు ఇక్కడే:


తెలంగాణాలో కేసీయార్ ఫిరాయింపులు ప్రోత్సహించాడని ఏపీలో చంద్రబాబు దాన్ని అమలు చేశారు. నీవు ఒకటి అంటే నేను రెండు అన్న చందంగా ఏకంగా నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా ఇచ్చేశారు. తెలంగాణాలో ఏకైక ఫిరాయింపు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సనత్ నగర్ నుంచి 38 వేల పై చిలుకు ఓట్లతో నెగ్గి ఇపుడు జనామోదంతో టీయారెస్ ఎమ్మెల్యేగా మారిపోయారు. ఇపుడు కొత్త అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు అన్న మాట అసలు వినిపించడంలేదు. మరి ఏపీ సంగతి చూస్తే 23 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల కధ అలాగే ఉంది.


టికెట్ ఇచ్చి గెలిపిస్తారా :


తెలంగాణాలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు అందరికీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు  కేసీయార్. మరి అదే తీరున ఏపీలో కూడా మొత్తానికి మొత్తం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు టికెట్లు టీడీపీ ఇస్తుందా, ఇస్తే వాళ్ళు గెలుస్తారా అన్న డౌట్లు అందరిలో ఉన్నాయి. నిజానికి ఏపీలో ఫిరాయింపు కంపు కధ ఇంకా  కొనసాగుతోంది. నిన్నటికి నిన్న డిల్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీలు మరో మారు డిమాండ్ చేశారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కళ్ళాం కూడా గోడ దూకిన ఎమ్మెల్యేలపై యాక్షనేదీ అంటూ సేవ్ ఆంధ్ర ప్రదేశ్ మీటింగులో ప్రశ్నించారు. 

మరి ఫిరాయింపుల విషయం వస్తే ఇంతవరకూ తెలంగాణాను ఆదర్శంగా చూపిన ఏపీ టీడీపీ ఇపుడు అక్కడ జరిగినట్లుగా ఇక్కడ చేయగలదా అన్నది చూడాలి. నిజానికి కేసీయార్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వ్యతిరేకత ఉన్నా తన జనాకర్షణ శక్తితో గెలిపించుకున్నారు. నన్ను చూసి ఓటు వేయండని జనాలను కోరారు. మరి ఏపీలో ఆ పని బాబు చేయగలరా. వారి పట్ల ఉన్న వ్యతిరేకతను తగ్గించి మళ్ళీ అసెంబ్లీ గడపకు తీసుకురాగలరా... చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: