వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా ఏపిలో ప్రచారం చేస్తానని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసి చేసిన ప్రకటన అందరికీ తెలిసిందే. ఏపిలో తాను ప్రచారం చేయాల్సిన నియోజకవర్గాల జాబితాను కూడా ఓవైసి రెడీ చేసుకున్నట్లు సమాచారం. జగన్మోహన్ రెడ్డి తనకు సన్నిహిత మిత్రుడు కాబట్టే వైసిపి తరపున పోటీ చేసి చంద్రబాబు ఓటమిని చూడాలనేది అసదుద్దీన్ ఉద్దేశ్యం. చంద్రబాబుకు ఓవైసికి మధ్య సంబంధాలు ఉప్పు, నిప్పన్న విషయం అందరికీ తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఓవైసి బ్రదర్స్ సంబంధాలు ఈనాటివి కావు. వైఎస్ ఇఫుడు లేకపోయినా జగన్ తో కూడా ఓవైసి బ్రదర్స్ అవే సంబంధాలు కొనసాగిస్తున్నారు.

 

మొన్నటి తెలంగాణా ఎన్నికల్లో చంద్రబాబు దాదాపు వారం రోజుల పాటు  విస్తృతంగా తిరిగి రోడ్డు షోలు, బహిరంగసభల్లో పాల్గొన్నారు. అసలే చంద్రబాబుకు కెసియార్, ఓవైసి బ్రదర్స్ కు ఏమాత్రం పడదు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు వచ్చి తెలంగాణాలో కెసియార్, ఓవైసిలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. దానికితోడు తన ప్రసంగాల్లో చంద్రబాబు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, శంషాబాద్ విమానాశ్రయం నిర్మాణం లాంటివి తానే చేశానని పచ్చి అబద్దాలు చెప్పారు. తన ప్రచారంలో అవాస్తవాలు చెప్పటంతో కెసియార్, ఓవైసిలకు బాగా మండింది. అందుకే చంద్రబాబుకు తాను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కెసియార్ చెబితే, చంద్రబాబును ఓడించటానికి జగన్ కు మద్దతుగా తన తడాఖా ఏమిటో చూపిస్తానని సవాలు విసిరారు.


రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయటానికి అసద్ ఇఫ్పటికే ఓ లెక్క రెడీ చేసుకున్నారట. అసదుద్దీన్ ప్రచారమంటే ప్రధానంగా ముస్లిం ప్రాబల్యమున్న నియోజకవర్గాలే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముస్లిం ప్రాబల్యమున్న నియోజకవర్గాలు రాష్ట్రంలో సుమారు 25 దాకా ఉన్నాయి. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. అలాగే చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, పీలేరులో ఎక్కువగానే ఉన్నాయి. ఇక,  తిరుపతి, చిత్తూరులో కూడా పెద్ద సంఖ్యలో ఓట్లున్నాయి. ఇవికాకుండా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సుమారు ఐదు నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ స్ధాయిలో ఉన్న విషయం తెలిసిందే. కాబట్టి అసద్ ప్రచారం చేయబోయే నియోజకవర్గాలు సుమారుగా 25 దాకా ఉండొచ్చనేది లెక్క ఫైనల్ అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: