తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏ ఈరన్న రాజీనామా చేశారు. రాజీనామా చేశారు అనేకంటే తప్పని పరస్ధితుల్లోనే రాజీనామా చేశారనుకోండి అది వేరే సంగతి. హై కోర్టు, సుప్రింకోర్టు ఆదేశాలు ఇవ్వటంతో ఎంఎల్ఏగా రాజీనామా చేయక తప్పలేదు. 2014లో అనంతపురం జిల్లా మడకశిర ఎంఎల్ఏగా ఇ ఈరన్న గెలిచారు. అయితే, ఆయన తన అఫిడవిట్లో తనపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు చెప్పలేదట. అదే విషయమై వైసిపి తరపున పోటీ చేసి ఓడిపోయాన తిప్పేస్వామి అప్పట్లోనే రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్ళారు. కానీ రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదు. 

 

రిటర్నింగ్ అధికారి పట్టించుకోకపోవటంతో తిప్పేస్వామి కోర్టును ఆశ్రయించారు. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు కోర్టులో కేసు విచారణ జరిగింది. సరే మన కోర్టులంటే ఇన్ స్టంట్ విచారణ, న్యాయం జరగదు కదా ? అందుకే షెడ్యూల్ ఎన్నికలు ముగిసేందుకు మరో ఆరు మాసాలుండగా ఈరన్న ఎన్నిక చెల్లదని కొట్టేసింది. దాంతో ఈరన్న సుప్రింకోర్టుకెక్కారు. కేసును విచారించిన సుప్రింకోర్టు కూడా హై కోర్టు తీర్పునే సమర్ధించింది. దాంతో ఈరన్న రాజీనామా  చేయక తప్పలేదు.

 

అసలు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, తిప్పేస్వామి వెంటనే ఫిర్యాదు చేసినా అప్పటి రిటర్నింగ్ అధికారి ఎందుకు స్పందించలేదు ? ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం అభ్యర్ధి అఫిడవిట్లో అన్నీ వివరాలు ఇచ్చారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత రిటర్నింగ్ అధికారిదే. తన బాధ్యతను తాను సక్రమంగా నిర్వర్తించటంలో విఫలమయ్యారని స్పష్టంగా తెలిసిపోతోంది. పోనీ ప్రత్యర్ధులు ఫిర్యాదు చేసినపుడైనా స్పందించాల్సుంది. ఆ పని  కూడా  చేయలేదు. అంటే వైసిపి అభ్యర్ధి తిప్పేస్వామిని వరించాల్సిన ఎంఎల్ఏ పదవి ఎన్నికల విధుల్లో ఉన్న ఉన్నతాధికారులు ఉద్దేశ్యపూర్వకంగా చేసిన తప్పిదం వల్ల టిడిపి అభ్యర్ధిని వరించింది. మరి రిటర్నింగ్ అధికారిపై ఏ విధమైన చర్యలు తీసుకోరా ?


మరింత సమాచారం తెలుసుకోండి: