రాజకీయాల్లో ఎపుడూ ఒకేలా ఉండదు, అనుకున్నట్లుగా ఎక్కడా జరగదు. ఆ లెక్కలు తేల్చడం ఎవరి వల్లా కాదు. మొన్నటికి మొన్న కర్ణాటక ఫలితాలు చూసిన తరువాత కాంగ్రెస్ కూటమి తధ్యమనుకున్నారు. ఇవాళ మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలుపు తరువాత రాహుల్ ప్రధాని అవుతారనుకున్నారు. అయితే సీన్ మారుతోంది. జాతీయ రాజకీయాల్లో సరికొత్త వంటకం తయారవుతోంది.


పీఎం పీఠంపై మమత:


ప్రధాన‌మంత్రి పీఠంపై మమతా బెనర్జీ పెద్ద ఆశలే పెట్టుకున్నారు. బెంగాల్ సీఎం గా రెండు విడతలుగా అధికారంలో ఉన్న మమతకు ఇపుడు హస్తిన‌వైపు చూపు పడింది. చాలాకాలంగా ఆమె ఆ వైపుగా పావులు కదుపుతున్నారు. పశ్చిమ బెంగాల్లో 42 లోక్ సభ సీట్లు ఉన్నాయి. ఇందులో మెజారిటీ అంతే 35కి తక్కువ కాకుండా దీదీ గెలుచుకోవడం ఖాయం. దాంతో ఆమె సంకీర్ణ యుగంలో పీఎం పోస్ట్ కి గేలం వేస్తున్నారు. ఈ ఆలొచనతోనే ఆమె కాంగ్రెస్ నాయకత్వానికి, రాహుల్ కి అసలు మద్దతు ఇవ్వడంలేదు. మూడు రాష్ట్రాలో గెలిచిన హస్తం పార్టీని అభినందించనూ లేదు.


ప్రాంతీయ  కూటమి :


మమత కేంద్రంలో అధికారం చేపట్టేందుకు కూటమి రాజకీయాలు మొదలుపెట్టారు. ప్రాంతీయ  పార్టీలతో కాంగ్రెస్, బీజెపీ లేని కొత్త కూటమిని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో త్రుణమూల్ కాంగ్రెస్ తో పాటు, ఎస్పీ, బీఎస్పీ, ఆం ఆద్మీ వంటివి ఉంటాయట. మమత కూటమి పక్కా ప్రాంతీయ పార్టీల కూటమి అంటున్నారు. అచ్చం కేసీయార్ ప్రతిపాదించిన కూటమి లాగానే ఇది ఉండడం విశేషం. మరి ఈ కూటమిలో కేసీయర్ ఉంటారా అన్న ఆలొచనలు కూడా వస్తున్నాయి.
ఒకవేళ కేసీయార్ ఉంటే చంద్రబాబు ఉండే చాన్సే లేదు. పైగా బాబు కాంగ్రెస్ తో కలసి జాతీయ రాజకీయాల్లో ఉన్నారు. ఆయన వరస అక్కడ మమతకు నచ్చడంలేదు. మరి కేసీయార్ కూడా వెళ్తే  ఏపీలో బాబు వ్యతిరేకమైన వైసీపీ కూడా మమత కూటమిలోకి రావడం ఖాయం ఆ విధంగా 2019 ఎన్నికల్లో ప్రాంతీయ  పార్టీల కూటమికి అధికారంలోకి తీసుకురావాలని మమత గట్టిగా భావిస్తున్నారు.


బాబుకు షాకే:


మమత ప్రయత్నాలకు మిగిలిన ప్రాంతీయ  పార్టీలు కూడా మద్దతు ఇస్తున్న తరుణంలో కాంగ్రెస్ తో అంటకాగాలనుకుంటున్న టీడీపీకి ఇబ్బందులు తప్పవంటున్నారు. కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ ని కూర్చోబెట్టడానికి జరిగే ఏ ప్రయత్నాన్ని అయినా అంగీకరించమని మమత, మాయావతి ఇప్పటికే స్పష్టం చేశారు. ములాయం సింగ్ పార్టీ కూడా కాంగ్రెస్ అంటే గిట్టనట్లుగా ఉంటోంది. ఈ కొత్త ఎపిసోడ్ తో ఇపుడు బాబుకు జాతీయ రాజకీయాల్లో మునుపటిలా చక్రం తిప్పే అవకాశాలు లేనే లేవని అంటున్నారు. 

తెలంగాణాలో ఎన్నికలు పూర్తి చేసుకుని కేసీయార్, అసెంబ్లీ ఎనికలు దగ్గర్లో లేని మమత, మాయావతి వంటి వారు రేపటి జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. అపుడు వారే రేపటి కూటమి వంటగాళ్ళు అవుతారు. మరి ఏపీలో అధికారం కోసం భీకరమైన పోరుని ఎదుర్కొనే బాబు అన్ని విధాలుగా వెనకబడడమే కాదు, ఆయన ఆలొచనలకు కూడా ప్రాంతీయ పార్టీలైన మమత తదితరులు  సహకరించే అవకాశాలు కనిపించడంలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: