తెలుగుదేశంపార్టీ రోజురోజుకు మరింతగా దిగజారిపోతోంది. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో కూడా చవకబారు రాజకీయాన్ని వదలిపెట్టటం లేదు. అనంతపురం జిల్లాలో మడకశిర టిడిపి ఎంఎల్ఏ ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చిన తర్వాతే చంద్రబాబు చవకబారు రాజకీయానికి తెరలేపారు. సుప్రింకోర్టు ఆదేశాల నేపధ్యంలో మామూలుగా అయితే జిల్లా రిటర్నింగ్ అధికారి వైసిపి నేత తిప్పేస్వామిని ఎంఎల్ఏగా ప్రకటించాలి. హై కోర్టయినా, సుప్రింకోర్టయినా ఇచ్చిన తీర్పదే. ఇక్కడే చవకబారు రాజకీయం మొదలైంది. తనపైన వేటు తప్పదని గ్రహించిన టిడిపి నేత ఈరన్న తన ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేశారు.

 

ఎంఎల్ఏగా అనర్హుడని సుప్రింకోర్టే తీర్పు చెప్పేసిన తర్వాత ఈరన్న రాజీనామా చేయటమేంటో అర్ధం కావటం లేదు. రాజీనామాకు ముందు ఈరన్న చంద్రబాబు, నారా లోకేష్ తో భేటీ అయ్యారు. తర్వాతే రాజీనామా నాటకం మొదలైంది. రాజీనామా కూడా స్పీకర్ కోడెల శివప్రసాద్ కు ఇవ్వకుండా అసెంబ్లీ ఇన్చార్జి కార్యదర్శి విజయరాజుకు ఇచ్చేసి స్పీకర్ ను కలవకుండానే ఈరన్న వెళ్ళిపోయారు.  అంటే ప్రొసీజర్ అనే నాటకానికి తెర లేచిందన్న విషయం అర్ధమైపోతోంది.

 

మామూలుగా అయితే ఈరన్న ఇచ్చిన రాజీనామాను కార్యదర్శి స్పీకర్ కు పంపాలి. అప్పుడు స్పీకర్ రాజీనామా చేసిన ఈరన్నను పిలిపించాలి. రాజీనామా ఎందుకు  చేశారో అడగాలి. దానికి ఈరన్న ఏదో సమాధానం చెబుతారు. ఆ తర్వాత రాజీనామాను స్పీకర్ ఆమోదించేది లేంది తెలుస్తుంది. ఒకవేళ ఆమోదించినా అప్పటికి పుణ్యకాలం అయిపోతుంది. ఎందుకంటే, షెడ్యూల్ ఎన్నికలకు గడువుండేది ఇక ఐదు మాసాలే. ఈ ఐదు మాసాలు ఏదో విధంగా గడిపేస్తే తిప్పేస్వామిని వైసిపి ఎంఎల్ఏగా గుర్తించాల్సిన అవసరం రాదు. ఇటువంటి చవకబారు ట్రిక్స్ తోనే టిడిపి నాలుగున్నరేళ్ళ కాలం గడిపేసింది. చివరకు సుప్రింకోర్టు ఆదేశాలను కూడా తన చీప్ ట్రిక్స్ తోనే అడ్డుకుంటోంది.

 

ఒకవేళ ఈరన్న రాజీనామాపై ఏదో ఓ నిర్ణయం తీసుకున్నా తిప్పేస్వామిని మాత్రం ఎంఎల్ఏగా గుర్తించేందుకు నిరాకరించేందుకున్న అవకాశాలనే అధికార పార్టీ వెతుకుతుందనటంలో సందేహం లేదు. సుప్రింకోర్టు నుండి తమకు అధికారికంగా ఆదేశాలు రాలేదని చెప్పేందుకే అవకాశాలు ఎక్కువున్నాయి. ఒకవేళ వచ్చినా అందిన ఆదేశాల్లో బొక్కలు వెతికేందుకే ప్రయత్నిస్తుంది. మొత్తం మీద ఫిబ్రవరిలో షెడ్యూల్ రిలీజయ్యేంత వరకూ ఇదే విధమైన చీప్ ట్రిక్స్ తోనే నెట్టుకొస్తుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: