ఎన్నికలు ఇంకా జరగలేదు. కానీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ అపుడే ఒక సీటు గెలుచుకుంది. ఇంతాకాలం అసెంబ్లీలో లాగుడు, గుంజుడు ఫిరాయింపుల నాటకంలో అచ్చంగా 23 మంది ఎమ్మెల్యేలను పోగోట్టుకున్న వైసీపీకి ఎన్నికల వేళ తొలి బోణీ తగిలింది. కొత్తగా ఒక ఎమ్మెల్యే జత కానున్నాడు. ఇన్నాళ్ళ కష్టానికి ఇది ఆనందించతగిన ఫలితమని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.  ఇది శుభారంభమని ఆ పార్టీ నేతలు పొంగిపోతున్నారు.  


ఎమ్మెల్యేగా తిప్పేస్వామి :


మడకశిర ఎమ్మెల్యేగా ఈ రోజు  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిప్పేస్వామి ప్రమాణస్వీకారం చేయనున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నపై సుప్రీంకోర్టు అనర్హత వేటు వేయడంతో తిప్పేస్వామికి ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఈరన్న.. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తనపై ఉన్న క్రిమినల్‌ కేసులతోపాటు కుటుంబసభ్యుల ప్రభుత్వ ఉద్యోగాల గురించి ప్రస్తావించలేదని వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన హైకోర్టు తిప్పేస్వామి వాదనను సమర్థిస్తూ.. ఈరన్న ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది 

దీన్ని సవాల్‌ చేస్తూ ఈరన్న సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. విచారణ జరిపిన ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రతులను వైసీపీ నేతలు ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. దీంతో ఇవాళ తిప్పేస్వామి ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. మొత్తానికి చూసుకుంటే వైసీపీకి కొత్తగా మరో ఎమ్మెల్యే ప్లస్ అయితే టీడీపీకి మైనస్ అన్న మాట ఫిబ్రవరిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ అదనపు ఓటు వైసీపీకి బాగానే ఉపయోగపడుతుందంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: