ప్రజలకు ఏది అవసరమో అది అందిపుచ్చుకుని పోరాటం చేసిన పార్టీయే ముందుకుపోతుంది. ఆ సమస్యపై గొంతెత్తిన వాడే బలమైన నాయకుడు అవుతాడు. అయితే జనం ఏమనుకుంటున్నారు. వారికి ఏది ప్రధానం అన్నది తెలుసుకోవడంలోనే తెలివిడి ఉంటుంది. ఇపుడు ఏపీలో అదే జరుగుతోంది. ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ రెండూ దాని వైపే చూస్తున్నాయి.


జగన్ టార్గెట్ :


ప్రత్యేక హోదా అన్నది ఇప్పటికీ సజీవంగా ఉందంటే అందుకు వైసీపీ నాలుగేళ్ళ పాటు చేసిన అనేక పోరాటాలే కారణం. ఓ వైపు కేంద్రంలో టీడీపీ అధికారం పంచుకుని ప్రత్యేక ప్యాకేజ్ చాలా ముద్దు అన్న రోజుల్లో అగ్గి రాజేసి జనాన్ని చైతన్యం చేసిన ఘనత కచ్చితంగా వైసీపీకే దక్కుతుంది. అటువంటిది ఈ ఏడాది మధ్యలో బీజేపీ నుంచి బయటకు వచ్చిన టీడీపీ నాటి నుంచి హోదా అంశాన్ని తానే అందిపుచ్చుకుని జనంలోకి పోతోంది. మరో వైపు వైసీపీ ఈ విషయంలో కాస్త వెనకబడింది. దాంతో దీన్ని గుర్తించిన జగన్ మరో మారు ఈ వేడిని రగిల్చేందుకు రంగం సిధ్ధం చేశారు.


డిల్లీలో మహాధర్నా :


వైసీపీ మాజీ ఎంపీలు, పార్టీ ఎమెల్యేలు, అసెంబ్లీ ఇంచార్జిలు ఇతర సీనియర్ నాయకులతో ఆ పార్టీ ఈ నెల 28న మహా ధర్నా కార్యక్రమాన్ని డిల్లీలో చేపడుతోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నందువల్ల ఈ ఆందోళన డిల్లీలో చేపడితే హైలెట్ కావడమే కాకుండా సర్కార్ ద్రుష్టికి వెళ్తుందని వైసీపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఇక ఈ పోరాటం ఆరంభం మాత్రమేనని, మరో నెలలో జగన్ పాదయాత్ర పూర్తి అయితే పూర్తి స్థాయిలో మళ్ళీ పూర్వం మాదిరిగా ఆందోళనలు పెద్ద ఎత్తున చేపట్టి హోదా ఉద్యమాన్ని జనంలోకి తీసుకుఓతామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. 


జగన్ సైతం ఎన్నికల అజెండాలో అగ్ర భాగంలో ప్రత్యేక హోదా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. పోరాటాలు వైసీపీ చేసింది. హోదా కోసం ఏడాది పదవీకాలం వైసీపీ ఎంపీలు త్యాగం చేశారు. ఇంతా చేసి దాని క్రెడిట్ వైసీపీకి దక్కకపోతే అంతా వ్రుధా అని అధినేత అభిప్రాయపడుతున్నారని భోగట్టా. మొత్తనికి చూసుకుంటే వైసీపీ మళ్ళీ హోదా జెండా ఎత్తడంతో ఏపీ రాజకీయాలు వెడెక్కనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: