అవును మీరు చదివింది నిజమే. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ టిక్కెట్టు కావాలంటే ఎవరైనా సరే రూ 30 కోట్లు తేవాల్సిందేనట. అప్పుడే టిక్కెట్టు వస్తుందంటున్నారు మాజీ ఎంఎల్ఏ వరదరాజులరెడ్డి. ప్రొద్దూటూరులో బిసి కులసంఘాల నేతల సమావేశం జరిగింది. నియోజకవర్గంలోని 2.20 లక్షల ఓట్లలో బిసికులాల ఓట్లే సుమారు 1.10 లక్షలుంటాయని బిసి నేతలన్నారు. కాబట్టి రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుండి పోటీ చేసే అవకాశం బిసిలకే ఇప్పించాలని డిమాండ్ చేశారు. బిసి కులాల్లో ఎవరికి టిక్కెట్టు ఇఫ్పించినా మిగిలిన వాళ్లంతా ఏకమై అభ్యర్ధిని గెలిపించుకుంటామని కూడా హమీ ఇచ్చారు.

 

తర్వాత వరదరాజులరెడ్డి మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయటానికి బిసి కులాల నేతలు ముందుకు రావటం సంతోషంగా ఉందన్నారు. అయితే, ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఎవరైనా సరే రూ. 30 కోట్లు ఖర్చు పెట్టాల్సిందేనంటూ పెద్ద బాంబు పేల్చారు. టిక్కెట్టు అడగటంలో ఉన్న ఉత్సాహం రూ 30 కోట్లు ఖర్చు పెట్టటంలో కూడా చూపాలన్నారు. అటువంటి నేతలెవరైనా ముందుకు వస్తే టిక్కెట్టిప్పించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ కూడా ఇచ్చారు. ఇప్పటికి ఆరుసార్లు ఎంఎల్ఏగా గెలిచిన తనకు ఏడోసారి ఎంఎల్ఏ అయినా కాకపోయినా ఒకటేనన్నారు.

 

రాబోయే ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేసేందుకు వెనకాడని బిసి సంఘాల్లో ఎవరైనా నేతలుంటే ముందుకు రావాలన్నపుడు ఏ ఒక్క నేత కూడా నోరిప్పలేదు. వరదరాజులు చెప్పిన మాటలు వింటుంటే ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఏ మేరకు పెరిగిపోయిందో అర్దమవుతోంది. వరదరాజులు చెప్పినంత డబ్బు ఎందుకన్నదే అర్ధం కావటం లేదు. టిక్కెట్టిచ్చేది చంద్రబాబునాయుడు.


పోటీ చేసేది ఎవరో అభ్యర్ధి. మధ్యలో వరదరాజులరెడ్డికి రూ. 30 కోట్లు ఎందుకు చూపాలి ? పైగా రూ 30 కోట్లు తెచ్చిన వారికి టిక్కెట్టిప్పిచ్చే బాధ్యత తాను తీసుకుంటానని చెబుతున్నారు మాజీ ఎంఎల్ఏ. ఏ హోదాతో వరదరాజులు హామీ ఇస్తున్నారు. అంత డబ్బు ఖర్చు పెట్టుకునే స్తోమత ఉన్న నేతలు అసలు వరదరాజులు రెడ్డి మీద ఎందుకు ఆధారపడతారు ? ఇంకోరికి టిక్కెట్టిప్పించేంత శక్తే వరదరాజులరెడ్డికి ఉంటే ఆ టిక్కెట్టేదో తానే తెచ్చుకోలేకపోయారా ?


మరింత సమాచారం తెలుసుకోండి: