ఎన్నికలు అంటే ఓట్లే ప్రధానం, ఎక్కడ ఎక్కువ ఓట్లు ఉన్నాయి, ఏ ఓటు బ్యాంక్ ని పట్టేస్తే గెలుపు గుర్రం ఎక్కవచ్చు ఇలా సాగుతూంటాయి లెక్కలు. మరి అటువంటి ఓటు బ్యాంక్ దక్కకుండా పోతుందేమోనని ఆందోళన ముందు చూపున్న  రాజకీయ నాయకులకు కలగడం సహజం. ఏపీలో చూస్తే అనేక సామాజిక సమీకరణలు రేపటి ఎన్నికలను శాసించబోతున్నాయి...


ఒవైసీ ప్రకటనతో :


గత ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంక్ ని టీడీపీ చేజార్చుకుంది. నాడు బీజేపీతో దోస్తీ కట్టి ఎన్నికలకు వెళ్ళడం వల్ల టీడీపీకి ముస్లిం మైనారిటీలు దూరంగా ఉన్నారు అదే సమయంలో వైసీపీకి వారు మూకుమ్మడిగా మద్దతు ప్రకటించారు. ఈ పరిణామలు ఇలా ఉండగా ఈ ఏడాది బడ్జెట్ తరువాత బీజేపీ నుంచి విడిపోయిన టీడీపీ నాటి నుంచి మళ్ళీ ముస్లిం వర్గాన్ని దువ్వడం ఆరంభించింది. అందులో భాగంగా ఏకంగా ముస్లిం నేత ఫరూక్ ని మంత్రికి కూడా చేసింది. 

రేపటి ఎన్నికల్లో గుత్తమొత్తంగా ముస్లిం ఓటు టీడీపీకి రాకపోయినా సగానికి సగమైన వైసీపీ నుంచి చీలిస్తే ఎన్నికల గండం గట్టెక్కుతామని టీడీపీ భావిస్తోంది. సరిగ్గా ఈ టైమ్ లో మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ ఓ భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. జగన్ తనకు దోస్తు అని, వచ్చే ఎన్నికల్లో అయనకు మద్దతుగా ఏపీలో ప్రచారం చేస్తానని. ఇదే ఇపుడు టీడీపీ అధినాయకత్వాన్ని తెగ కలవరపెడుతోంది.


ఐకాన్ గా ఒవైసీ :


ఉమ్మడి ఏపీలోనూ, విడిగానూ చూసినా ముస్లిం వర్గానికి ఐకాన్ గా ఓవైసీ మజ్లిస్ పార్టీ ఉంటోంది. దేశంలో ఆ పార్టీ బలం పెద్దగా లేకపోయినా తెలుగు రాష్ట్రాల్లో మాతం ప్రభావితం చేసే స్థాయిలో ఉంది. తెలంగాణా ఎన్నికల్లో కేసీయార్ కి మద్దతు ఇచ్చి ఓవైసీ చలా చోట్ల ముస్లింల ఓటు అటు తిరిగేలా చూశారు. ఇక ఏపీలో ఇప్పటికే ముస్లిం వర్గాలు జగన్ వైపు ఉన్నారు. టీడీపీ ఎన్నికల ముందు మంత్రి పదవి ఇచ్చినా ఆ పార్టీ పట్ల పెద్దగా గురి కుదరడంలేదు.

 ఈ సమయంలో ఒవైసీ కూడా జగన్ కే మద్దతు అని ముందుకు వస్తే ఇక నామమాత్రం మద్దతు కూడా ముస్లిం వర్గాల నుంచి టీడీపీకి ఉండదేమోన్న బెంగ హై కమాండ్ కి పట్టుకుంది అందుకే ఇటీవల కాలంలో బాబు స్వరం పెంచి నేరుగా ఒవైసీ మీదనే బాణాలు వేస్తున్నారు. ఏకంగా ఒవైసీతో బీజేపీకి, మోడీకి కలిపి కొత్త లింకు పెడుతున్నారు. మరి ముస్లిం వర్గం దీన్ని నమ్ముతుందా. ఏది ఏమైనా జగన్ కి మజ్లిస్ మద్దతు మాత్రం టీడీపీని నిద్రపోనీయడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: