కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎంఎల్సీలు టిఆర్ఎస్ లో విలీనం అవుతున్నారు. కాంగ్రెస్ ఎంఎల్సీలుగా ఉన్న తమను టిఆర్ఎస్ లో విలీనం చేయాలని మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ కు లేఖ ఇవ్వటం సంచలనంగా మారింది. కాంగ్రెస్ కు చెందిన ఎంఎల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్ టిఆర్ఎస్ లో చేరుతున్నారు. వీరి కాకుండా ఇప్పటికే దామోదర్ రెడ్డి ప్రభాకర్ టిఆర్ఎస్ లో చేరారు. దాంతో కాంగ్రెస్ పార్టీకి కౌన్సిల్లో పెద్ద దెబ్బ పడినట్లే లెక్క. ఉన్నదే ఏడుగురు శాసనమండలి సభ్యులు. వీరిలో నలుగురు టిఆర్ఎస్ లో విలీనమైపోతే మిగిలిది ముగ్గురు మాత్రమే.

 

 

అయితే వీరిలో కూడా ఇద్దరు సీనియర్లు షబ్బీర్ ఆలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి పదవీ కాలం మార్చి నెలతో ముగుస్తోంది. మరో సీనియర్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మునుగోడు ఎంఎల్ఏగా గెలవటంతో కౌన్సిల్  సభ్యత్వానికి  రాజీనామా చేశారు. అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మార్చి తర్వాత కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో ప్రాతినిధ్యమే ఉండదన్నది స్పష్టమైపోయింది. దాంతో టిఆర్ఎస్ కు ఎదురున్నదే ఉండదు. ఎలాగూ ఏడుగురు సభ్యుల్లో నలుగురు ఎంఎల్సీలు విలీనం లేఖ ఇచ్చారు కాబట్టి మిగిలినదంతా లాంఛనమే.

 

 

ఇక్కడ విచిత్రమేమిటంట, అందరూ ప్రజాస్వామ్యంలో విలువలు గురించి మాట్లాడేవారే. అధికారంలో ఉన్నపుడు ప్రజాస్వామ్యం, విలువలు ఏవి గుర్తుకు రావు. ప్రతిపక్షాలను చీల్చి చెండాటం ద్వారా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని అనుకుంటన్నారే కానీ తమ వ్యక్తిత్వం ద్వారా కానీ, తాము అమలు చేసే పథకాల ద్వారా మంచి జరిగి ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకోవాలని చూడటం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ వికృత క్రీడను గమనిస్తుంటే భవిష్యత్తులో ప్రతిపక్షాలన్నవే ఉండవేమో అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏదో ఒక విధంగా ప్రతిపక్ష సభ్యులను లొంగదీసుకోవాలని పాలకపక్షం అనుకుంటే జరిగేది ప్రజాస్వామం వినాశనమే.


మరింత సమాచారం తెలుసుకోండి: