వర్తమాన రాజకీయాల్లో సెన్సేషనల్ పొలిటికల్ స్టార్ గా ఉన్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ ఆంధ్ర పర్యటన ఖరారు అయింది. ఆయన పర్యటనలో భాగంగా విశాఖపట్నం వస్తున్నారు. కేసీయార్ పర్యటన సందర్భంగా విశాఖలో ఉత్కంఠ నెలకొంది. రెండవమారు తెలంగాణాలో గెలిచి జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారిన కేసీయార్ వైజాగ్ టూర్ ఇపుడు ఏపీ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది.


శారదాపీఠంలో:


కేసీయార్ ఈ నెల 23వ తేదీన విశాఖ వస్తున్నారు. ఆ రోజున ఉదయం పది గంటలకు కేసీయార్ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో బయల్దేరి విశాఖ చేరుకుంటారు. ఇక్కడ ఉన్న శ్రీ శారదాపీఠంలో ఆయన రాజశ్యామల హోమంలో కుటుంబ సభ్యులతో సహా పాలుపంచుకుంటారు. ప్రత్యేక పూజలు జరిపిన తరువాత శారదాపీఠం స్వామీజీ ఆశీస్సులు తీసుకుంటారు. ఆశ్రమంలోనే మధ్యాహ్న భోజనం చేసిన తరువాత కేసీయార్ అక్కడే కొంతసేపు విశ్రాంతి తీసుకుని అనంతరం ఒడిషా బయల్దేరివెళ్తారు. 


పెద్ద ఎత్తున ఏర్పాట్లు :


ఇదిలా ఉండగా కేసీయార్ రాక సందర్భంగా శారదాపీఠంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో కేసీయార్ తో హోమాలు చేయించిన స్వామిజీ కేసీయార్ గెలిచిన తరువాత అభినందనలు తెలియచేశారు. దానికి స్పందనగా కేసీయర్ తొందరలోనే ఆశ్రమాన్ని సందర్శిస్తానని చెప్పారు. అందులో భాగంగానే కేసీయార్ విశాఖ వస్తున్నారు. ఇదిలా ఉండగా కేసీయార్ విశాఖ పర్యటన రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని పెంచుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: