తెలంగాణాలో తెలుగుదేశంపార్టీ ఖాళీ అయిపోయినట్లే. మొన్నటి ఎన్నికల్లో టిడిపి తరపున గెలిచిన ఇద్దరు ఎంఎల్ఏలు టిఆర్ఎస్ లో చేరిపోతున్నారు. దాంతో తెలుగుదేశంపార్టీ తరపున ప్రజాప్రతినిధులే లేకుండా పోతున్నారు. ఉన్న ఇద్దరు కూడా టిఆర్ఎస్ లో చేరుతుండటంతో చంద్రబాబునాయుడు పరిస్ధితి ఉన్నది పోయింది ఉంచుకున్నదీ పోయిందన్నట్లుగా తయారవుతోంది. ఎంతమంది టిఆర్ఎస్ లో చేర్చాలని ప్రయత్నించినా సానుకూలంగా స్పందించని సత్తుపల్లి ఎంఎల్ఏ సండ్ర వెంకటవీరయ్య ఏకంగా ముఖ్యమంత్రి కెసియారే ఫోన్ లో మాట్లాడేటప్పటికి కాదనలేకపోయారట. 26వ తేదీన టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు సమాచారం.

 

సండ్రతో ఫోన్లో మాట్లాడిన కెసియార్ మంత్రిపదవిని ఆఫర్ చేశారని సమాచారం. మంత్రి పదవి అనేటప్పటికి సండ్రలో కూడా ఊగిసలాట మొదలైందట. నిజం మాట్లాడుకోవాలంటే సండ్రకు మంత్రి పదవి అన్నది కలలోని మాటనే చెప్పుకోవాలి. సిపిఎం తరపున మొదటిసారి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియెజకవర్గంలో ఎంఎల్ఏగా గెలిచారు. తర్వాత టిడిపిలోకి వచ్చేశారు. పాలేరులోనే పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో సత్తుపల్లికి వెళ్ళిపోయారు. అక్కడి నుండి రెండుసార్లు వరుసగా గెలిచారు. దాంతో తెలంగాణాలో టిడిపిలో సండ్ర కీలకంగా మారారు.

 

ఆ దశలోనే పోయిన ఎన్నికల్లో రెండోసారి సత్తుపల్లిలో గెలిచిన సండ్ర అనూహ్యంగా ఓటుకునోటు కేసులో ఇరుక్కున్నారు. అదే కేసులో మాజీ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డితో పాటు 14 రోజుల రిమాండ్ లో కూడా గడిపారు. అప్పటి నుండి సండ్ర మెడపై ఓటుకునోటు కేసు కత్తి వేలాడుతునే ఉంది. దాన్ని సాకుగా చూపి టిఆర్ఎస్ లోకి లాక్కోవాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ నేపధ్యంలోనే మొన్న ఎన్నికల్లో మళ్ళీ సత్తుపల్లిలో గెలిచిన దగ్గర నుండి మళ్ళీ ఒత్తిడి మొదలైంది. దానికితోడు ఏకంగా కెసియారే ఫోన్ చేయటం మంత్రి పదవి ఆఫర్ చేయటంతో సండ్ర కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కాకపోతే అశ్వారావుపేట నుండి గెలిచిన రెండో ఎంఎల్ఏ మెచ్చా నాగేశ్వరారావు విషయమే తేలాల్సుంది. ఆయన కూడా తొందరలోనే టిఆర్ఎస్ లోకి రావటం ఖాయమంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: