పార్టీకి జోష్ తెస్తున్నారు జగన్, జనాల్లో ధీటైన పార్టీగా కూడా ముందుకు తెస్తున్నారు. తన పాదయాత్ర ద్వారా పార్టీని జనాలకు బాగా చేరువ చేయగలిగారు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ జగన్ చేయాల్సిన అతి  ముఖ్యమైన వాటిని విస్మరిస్తున్నారని అంటున్నారు. అలా చేయకపోవడం మైనస్ అవుతుందా అన్న చర్చ పార్టీ లోపలా బయటా ఉంది.


అన్నీ జగనే :


జగన్ నోరు విప్పితేనే క్లారిటీ, జగన్ ఏం అనుకుంటున్నార వెల్లడిస్తేతే స్పష్టత. లేకపోతే లేదు. ఇదీ వైసీపీలో వింత పరిస్థితి. పార్టీ విధానాల నుంచి, పొత్తులు ఎత్తుల నుంచి, అభ్యర్ధుల ఖరారు నుంచి అన్నీ జగన్ చూసుకుంటున్నారు దాంతో మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎందరో సీనియర్లు ఉన్న వైసీపీ ఎటూ కాకుండా పోతోంది. జగన్ మాత్రం నింపాదిగా పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నారు. అలా వచ్చిన మైలేజిని కొనసాగించే స్థితి పార్టీలో ఉందా అంటే లేదన్నదే సమాధానంగా వస్తోంది.


గ్రూపుల గోల :


ఉత్తరాంధ్రలో జగన్ పాదయాత్ర తరువాత పార్టీ పరిస్థితి మెరుగుపడింది.టీడీపీ కంచు కోటలను జగన్ బద్దలు కొట్టుకుంటూ వేలాదిగా జనంతో కదం తొక్కుతున్నారు. ఇక జగన్ ఆ ప్రాంతం దాటేసాక పరిస్థితి ఎంటన్నది చూసుకుంటే మాత్రం బేజారవుతుంది. నాయకులు తమలో తాము కలహించుకుంటూ పార్టీని పక్కన పెట్టేస్తున్నారు. ఒక్కో అసెంబ్లీ సీటుకు నలుగురైదుగురు ఆశావహులు ఉంటున్నారు. వీరిలో ఎవరు రేపటి ఎమ్మెల్యే క్యాండిడేట్ అన్నది జగన్ చెప్పకపోవడంతో ఈ వాతావరణం ఏర్పడుతోంది.


పడకేసిన పార్టీ :


ఇక రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే ఎంతో మంది సీనియర్లు ఉన్నా గత ఏడాదిన్నర కాలంగా పార్టీ కార్యక్రమాలు  పడకేసాయి. సీనియర్లు పార్టీని నడిపించే స్థితిలో లేరు అనే కంటే వారికి ఆ స్వేచ్చ లేదు అనడం సబబు, అన్నీ జగనే చూడాలి. అంతా ఆయనే చేయాలన్న కేంద్రీక్రుతమైన విధానం వైసీపీలో ఉంది. దాంతో ఆ పార్టీ జగన్ తోనే సాగుతోంది. జగన్ తోనే ఆగుతోంది. మరి ఈ పొరపాట్లను సర్దిద్ద్దుకోకుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎంతలా జనాదరణ ఉన్నా పార్టీకి ఇబ్బందులు తప్పవు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: