బోడిగుండుకు మోకాలికి ముడి వేయటంలో చంద్రబాబునాయుడును మించిన వారు ఇంకెవరూ ఉండరు. రాష్ట్రంలో ప్రస్తుతం తాజా సమస్య ఏమిటంటే హై కోర్టు విభజనే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఏపిలో హై కోర్టు ఏర్పాటుకు సరైన భవనాలు లేవు. మౌళిక సదుపాయాలు కల్పించకుండానే హఠాత్తుగా హై కోర్టు ను విభజించటంపై లాయర్లందరూ మండిపోతున్నారు. ఇటువంటి విషయంలో చంద్రబాబు మోకాలికి బోడిగుండుకు ముడేస్తున్నారు. అదేమిటంటే, కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా హై కోర్టు విభజన జగన్మోహన్ రెడ్డికి లాభం చేయటం కోసమే చేసిందట.

 

జగన్ కు హై కోర్టు విభజనకు ఏమన్నా సంబంధం ఉందా ? మామూలుగా అయితే ఎవరూ ఆ మాటనరు. కానీ ఇక్కడున్నది చంద్రబాబు కదా ? చాలా తేలిగ్గా అనేశారు. ఇంతకీ  చంద్రబాబు చెప్పే రీజన్ ఏమిటంటే జగన్ పై ఉన్న కేసులన్నీ ఒక కొలిక్కి వచ్చేస్తున్నాయట. రేపో మాపో కేసుల్లో విచారణ పూర్తయి తీర్పు చెప్పటమే మిగిలున్నట్లు చంద్రబాబు చెబుతున్నారు. సో,  ఆ కేసుల్లో విచారణ పూర్తి కాకుండా, తీర్పు చెప్పే అవకాశం లేకుండా జగన్ కు మద్దతుగా కేంద్రమే హై కోర్టును ఉన్నపళాన విభజించేసిందట. ఎలా ఉంది చంద్రబాబు చెప్పిన లాజిక్ ? జనవరికల్లా హై కోర్టు తాత్కాలిక భవనాలు పూర్తి చేస్తానని చెప్పిందే చంద్రబాబు. చంద్రబాబు గతంలో అలా చెప్పటం వల్లే సుప్రింకోర్టు హై కోర్టును విభజించేసింది. కానీ లాయర్లు ఆందోళన మొదలుపెట్టటంతో వెంటనే హై కోర్టు విభజనకు జగన్ కేసులకు ముడేసేశారు.

 

ఇక్కడ విషయం ఏమిటంటే, రాష్ట్రంలో జరిగే ప్రతిదానిలోనూ జగన్ కు ముడేయటం చంద్రబాబుకు బాగా అలవాటైంది. పోలవరం నిర్మాణం సక్రమంగా జరగకపోయినా జగనే కారణం. ప్రత్యేకహోదా రాకపోవటానికి వైసిపినే మూలకారణం. అమరావతిలో రాజధాని నిర్మాణాలు ఇంత వరకూ మొదలు కాకపోవటానికి వైసిపి సహకరించకోవటమే కారణం. అభివృద్ధిని అడ్డుకోవటానికి వైసిపి కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కైందటారు. ఇలా.. ఏ విషయం తీసుకున్నా తన చేతకానితనాన్ని చాలా తేలిగ్గా జగన్ కు ముడేసేయటం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయింది. ఏం చేస్తాం చంద్రబాబు ఏం చెప్పినా భరించాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: